అనంతపురం కలెక్టరేట్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను ఐక్యంగా ఎండగదామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ కార్మిక, కర్షక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఏఫ్రిల్ 5న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ జిల్లాలో చేపట్టిన జీపుజాత శనివారం ముగిసింది. ఈ నెల 18న చేపట్టిన జీపుజాత తపోవనం మీదుగా నీలిమా సర్కిల్, ఆర్‌టిసి బస్టాండ్, శ్రీకంఠం సర్కిల్, కృష్ణ థియేటర్ సర్కిల్, తాడిపత్రి బస్టాండ్ వరకు సాగింది. అనంతరం తాడిపత్రి బస్టాండ్ వద్ద సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్ హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాల సవరించారు. నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చిందన్నారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ సంపదను దోచిపెట్టే విధంగా ఉందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాల మోడీ పాలనకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదామన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలన్నారు. ఆటో డ్రైవర్లు, హమాలీ కార్మికులందరికీ సమగ్ర చట్టం చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. యువతకు సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 5వ తేదీన ఢిల్లీ నగరంలో లక్షల మంది కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువత పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ, అధ్యక్షులు బాబు, ఉపాధ్యక్షులు ప్రకాష్ రెడ్డి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎర్రిస్వామి, లక్ష్మీ నరసమ్మ, వరలక్ష్మి, భగత్ సింగ్ ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, శివప్రసాద్, నాగరాజు, హమాలీ యూనియన్ నాయకులు గౌరప్ప, ఆదినారాయణ, రాజన్న, వెంకటేశ్వర్లు, కుళ్లాయి స్వామి, సాంబశివ, వెంకటేశు, నాగేంద్ర, చలపతి, రవి, శివ పాల్గొన్నారు.










