ప్రజా వ్యతిరేక విధాలను తిప్పికొట్టాలి
ప్రజాశక్తి-కావలి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టి ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడంలో రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్‌ఎస్‌పి) ముందుంటుందని రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుబ్బారాయుడు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిస్కారం చేయకుండా గాలికి వదిలేశాయన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడ తిష్ట వేసి ఉన్నాయని తెలిపారు. వాటిపై పోరాటాలు చేస్తున్న ప్రజాస్వామ్యవాదులపై అక్రమంగా కేసులు పెట్టడంతోపాటు, అనేకరకాల దాడులకు ఒడిగడుతుందని మండిపడ్డారు. అలాగే కేంద్రంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరిగి పోతుందన్నారు. రాష్టంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు సాగు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు దొరక్క ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థుతి నేడు రాష్ట్రంలో ఉందన్నారు. ప్రతి జిల్లాలో ఏదోక పరిశ్రమ ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలన్నారు. ఆర్‌ఎస్‌పి నెల్లూరు జిల్లా కార్యదర్శిగా రవికాంత్‌ను ఎకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అనంతరం రవికాంత్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో ఆర్‌ఎస్‌పి పార్టీతోపాటు దాని అనుబంధ ప్రజా, విద్యార్ధి, యువజన సంఘాలను బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బాబురావు, సీమోను, రాజేష్, మనోజ్, కిషోర్, తరుణ్, మని చంద్ర, పాల్గొన్నారు.










