Sep 09,2023 22:36

శంకుస్థాపన చేస్తున్న మంత్రి ధర్మాన

* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం : 
ప్రజా వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రూ.1.8 కోట్లతో నగరంలోని రామకష్ణనగర్‌లో నిర్మించిన అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఎనిమిది డివిజన్లకు ఈ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ఉపయోగపడుతుందన్నారు. ప్రైవేటు ఆస్పత్రి ఖర్చులు తగ్గించానే ఉద్దేశంతో అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గతంలో కన్నా ఇప్పుడు ప్రభుత్వాస్పత్రుల్లో ఎన్నడూ లేని విధంగా సిబ్బంది నియామకం చేపట్టామన్నారు. గతంలో మందులు, వైద్యులు, వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో ఉండే వారు కాదని, ఇప్పుడు 170 రకాల మందులను అందుబాటులో ఉంచామన్నారు. 63 టెస్ట్‌లు ఉచితంగా చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ చల్ల ఓబులేసు, డిసిఎంఎస్‌ చైర్మన్‌ గొండు కృష్ణ, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బొడ్డేపల్లి మీనాక్షి, వైసిపి పట్టణాధ్యక్షులు సాధు వైకుంఠరావు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎం.వి పద్మావతి, డాక్టర్‌ దానేటి శ్రీధర్‌, డాక్టర్‌ పైడి మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.