ప్రజా ఉద్యమాలను అణచి వేస్తే చరిత్ర హీనులవుతారు
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా ప్రజాసమస్యలపై పోరాడుతున్న ప్రజలు, నాయకులు పైన ఉక్కుపాదంతో ప్రజా ఉద్యమాలను అణచివేయడం దారుణమని, ఉద్యమాలను అణచివేసిన వారెవరు కూడా చరిత్రలో నిలవలేదని చరిత్రహీనులుగా నిలిచిపోయారని ఆదివారం చిత్తూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా రకరకాల పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం అణిచివేయడం దుర్మార్గమన్నారు. ప్రజలపై మోయలేని భారాలు వేస్తుంటే ప్రజలు ప్రశ్నించకుండా ఎలా ఉంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎవరు ప్రశ్నించకుండా ఉండాలంటే గతంలో ఇచ్చిన హామీలు ప్రజాసమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ప్రశ్నించే వారిని పోలీసులను ఉసిగొల్పి కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నాలు చేస్తే సూర్యకాంతిని ఎవరు అరిచేత్తో అడ్డుపెట్టలేరని అలాగే ఉద్యమాలను కూడా ఆపలేరని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. గతంలో ప్రజాఉద్యమాలను అణచిన ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, అలాంటి పరిస్థితి నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పడుతుందని గుర్తు చేశారు. తప్పు చేస్తే ఎవరినైనా చట్టప్రకారం శిక్షించవచ్చు, అయితే ప్రతిపక్ష నాయకుడు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అరెస్టు చేసిన తీరు దుర్మార్గమన్నారు. ఈ ఘటనలపై అందరూ కలిసి రావాలని సిపిఎం నిరంతరం ప్రత్యక్షంగా పోరాటాలకు కలిసి వస్తుందని తెలిపారు. చిత్తూరులో ప్రజాసమస్యలపై వేదికను పోలీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం నాయకులు దొరబాబు, జనసేన నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఎస్పి, రైతు సంఘం నాయకులు, మహిళా ప్రజాసంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.










