
* శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - ఆమదాలవలస: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పట్టణంలోని మార్కెట్ కమిటీ యార్డులో నూతనంగా మంజూరైన మండలం, మున్సిపాలిటీకి చెందిన 267 పింఛన్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. గతంలో పెన్షన్ రావాలంటే అధికార పార్టీ నాయకుల సిఫార్సులు కావాల్సి ఉండేదని, నేడు ఆ పరిస్థితి లేదన్న విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కోరారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరువవుతున్నాయని చెప్పారు. గ్రామ సచివాలయాల ద్వారా అర్హులకు సకాలంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా అర్హులకు సంక్షేమ పథకాలు నేడు అందుతున్నాయని తెలిపారు. గతంలో మాదిరి కాకుండా ప్రతినెల ఒకటో తేదీనే సామాజిక పెన్షన్లు వాలంటీర్ల ద్వారా ఠంచన్‌గా అందుతున్నాయన్నారు. ప్రజలందరూ మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని సంక్షేమ పథకాలు, అభివృద్ధిని రాష్ట్రంలో కొనసాగేలా దీవించాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, జెడ్‌పిటిసి బెండి గోవిందరావు, ఎంపిపి ప్రతినిధి తమ్మినేని శ్రీరామ్మూర్తి, పిఎసిఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, డిసిసిబి డైరెక్టర్ బొడ్డేపల్లి నారాయణరావు, సచివాలయాల కోఆర్డినేటర్లు బొడ్డేపల్లి నిరంజన్‌బాబు, అత్తులూరి రవికాంత్, సర్పంచ్‌లు చిలకలపల్లి సురేష్, ఎన్ని రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.