
ఆర్‌డిఒ భరత్ నాయక్
ప్రజాశక్తి- పలాస : పలాస రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, పేదలకు అండగా ఉంటానని ఆర్‌డిఒ భరత్ నాయక్ అన్నారు. స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. పలాస డివిజన్ పరిధిలో అపారమైన సహజ వనరులు కలిగి ఉన్నాయని, డివిజన్‌లో అన్ని రంగాల్లో అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. డివిజన్ పరిధిలో భౌగోళిక పరిస్థితులను అవగాహన చేసుకొని ఈ ప్రాంతాభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి నివేదిస్తానని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిశీలన చేసి వాటి పరిష్కారానికి చర్యలు చేపడతానని అన్నారు. విశాల సముద్ర తీరంతో పాటు ఉద్దానం, పల్లపు, గిరిజన ప్రాంతాలు కలిగి ఉన్న ఈ డివిజన్‌లోని అన్ని ప్రాంతాల్లో ప్రజలను చైతన్య పరుస్తూ ప్రభుత్వాలు అందించే సంక్షేమ, అభివృద్ధి ప్రజలకు చేరువ చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు. అన్ని వేళల్లో ప్రజలకు అందుబాటు ఉంటానని, ఎవరికి ఎ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముందుగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆర్‌డిఒకు తహశీల్దార్ మధుసూదనరావు, ఎంపిడిఒ రమేష్‌నాయుడు, విఆర్‌ఒల సంఘం నాయకులు సన్మానించారు.