ప్రజాశక్తి- పలమనేరు: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాల్సిందేనని జాతీయ మానవ హక్కులు, అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా ఉపాధ్యక్షులు వేలాయుధం పేర్కొన్నారు. అందులో భాగంగా శుక్రవారం పలమనేరు పట్టణంలో గల కార్యాలయంలో ప్రజా సమస్యలపై నియోజకవర్గ స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. పలమనేరు నియోజకవర్గ అధ్యక్షులు పార్థసారథి అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షులు డి.వి .మునిరత్నం హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా ప్రజాసమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉందన్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనేక మంది రైతులు భూ సమస్యలతో అల్లాడుతున్నారని , ప్రభుత్వం చేపట్టనున్న భూ రీ సర్వేలోనైనా పరిష్కారమవు తాయని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో చేపట్టక పల్లెజనం ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. అదే విధంగా గ్రామాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టకపోవడంతో కూలీలు చేయడానికి పనులు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడక్కడ అరకొర పనులు చేస్తున్న చోట దళారులు ప్రవేశించి యంత్రాలతో చేయడం వలన కూలీలకు దిక్కుతోచక ఆకాశానికి ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాల ద్వారా సాధించుకున్న జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులను అమలు పరచడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, దీంతో దళితులకు మహిళలకూ పిల్లలకు రక్షణ లేకుండాపోతుందని పేర్కొన్నారు. నాయకులు జయకుమార్ మాట్లాడుతూ ఇకమీదట జాతీయ మానవ హక్కులు సంస్థ ద్వారా ప్రతి గ్రామానికి వెళ్లి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తామని అవసరమైతే ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రఫీద్, రాజమణి, అమర నారాయణ, పొన్ను స్వామి, సుబ్బన్న, పుష్ప, భూదేవి, బాలరాజు, వెంకట ముని, వినోద్, సుబ్రహ్మణ్యం, సుధాకర్, శివలింగం, సుబ్బు, తదితరులు పాల్గొన్నారు.










