ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
ప్రజాశక్తి- పిచ్చాటూరు: మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో రెండవ మండల సర్వ సభ్య సమావేశం ఆదివారం ఎంపీపీ రేఖ హరిచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. సమావేశాన్ని ఎంపీపీ హెచ్ రేఖ ప్రారంభించి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు. అనంతరం శాఖల వారీగా అభివద్ధి సమస్యలపై చర్చించాలని ఎంపీడీవో శ్రీనివాస కోరగా శాఖల వారీగా వివరణ కోరారు. శాఖాధికారులు తమ శాఖకు సంబంధించి అభివద్ధి సమస్యలను సమావేశ మందిరంలో తెలియ జేశారు. ముఖ్యంగా రెవెన్యూ, మండల పరిషత్తు, నీటిపారుదల, రోడ్లు భవనాలు, వ్యవసాయం, విద్యా నాడు-నేడు, విద్యుత్తు, పశువర్ధక, ఆర్టీసీ మొదలగు పథకాలపై ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను వివరించారు. గంజాయి అరికట్టండి అంటూ సింగిల్విండో అధ్యక్షుడు హరిచంద్ర రెడ్డి పోలీసు వారిని కోరారు. ఎంపిటిసి రమేష్ రాజు మాట్లాడుతూ పిచ్చాటూరు వయా శ్రీరామపురం రోజు మూడు ట్రిప్పులు సత్యవేడు ఆర్టిసి బస్సులు ప్రయాణించే వారమని గత రెండు సంవత్స రాలుగా పూర్తిగా సర్వీసును రద్దు చేసి ప్రజలకు, అధికారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ప్రజలు, రైతులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు సచివాలయానికి వచ్చే అధికారుల కోసమైనా బస్సు నడపాలని కోరారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలోని పిచ్చాటూరు మండలానికి ఒక ప్రత్యేకత ఉందని అందువలన మండలంలో పనిచేసే అధికారులు ప్రజా సమస్యలపై దష్టి ఉంచి పరిష్కార దిశగా అడుగులు వేయాలన్నారు. త్వరలోనే కొత్త జిల్లా అయినా బాలాజీ జిల్లాలో పిచ్చాటూరు మండలానికి ఒక గొప్పవరంగా రాబో తుందని అందువలన ప్రతి ఒక్క అధికారి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని అభివద్ధి సమస్యను ఎప్పుడు పరిష్కరించే విధంగా పనిచేయాలని కోరారు. అరణియార్ ప్రాజెక్టులో కొత్తగా సుందర వనంగా గొప్పగా అభివద్ధి జరగబోతుందని దీనికితోడు ప్రాజెక్టుల బోటింగ్ లైట్ హౌస్ అభివద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, తహశీల్దార్ శ్రీదేవి, ఎంఈఓ హేమమాలిని, ఏపిఎం వనిత, ఎంపీపీ రేఖ, జడ్పీటీసీ విష్ణుప్రియ, మండల పార్టీ అధ్యక్షులు హరిచంద్ర రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ నాయుడు, ఎంపిటిసిలు, సర్పంచులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.










