ప్రజాశక్తి-గుంతకల్లు పట్టణంలోని ప్రజా సమస్యలను అధికారులు పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగదని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక మునిసిపల్ కార్యాలయం ఎదుట సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రిలే దీక్షలు చేపట్టారు. దీక్షలను ఆపార్టీ జిల్లా కమిటీ సభ్యులు డి.శ్రీనివాసులు ప్రారంభించగా, మండల కార్యదర్శి దాసరి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది కాలంగా ఆపరేషన్ థియేటర్ లేదన్నారు. గర్భిణులకు అత్యవసర సమయాల్లో ఆపరేషన్ చేయాల్సివస్తే జిల్లా ఆసుపత్రికి రెఫెర్ చేసి ఇక్కడి వైద్యులు చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో వేలకు వేలు దండుకుంటున్నారని పేర్కొన్నారు. ఓటీ లేని కారణంగా కుటుంబ నియంత్రణ, కిడ్నీ వంటి శస్త్ర చికిత్సలకు అనంతపురం, కర్నూలుకు వెళ్లాలని సూచిస్తున్నారన్నారు. ఇతర విభాగాల్లో సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నా వైద్యం చేయకుండా డబ్బులు చెల్లిస్తేనే వైద్యం చేస్తామనే విధంగా ప్రయివేటు యాజమాన్యం వ్యవహరిస్తోందని అన్నారు. పట్టణంలో అనేక వార్డుల్లో తాగునీరు, రోడ్లు, మురుగు కాలువలు, వీధిలైట్లు వంటి మౌలిక సదుపాయాలకు కల్పించకుండా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రధానంగా పట్టణ శివారు ప్రాంతాల్లోని కాలనీలలో నివసిస్తున్న ప్రజలు తాగునీరు, రోడ్లు వీధి దీపాల మౌలిక సదుపాయాలకు ఆమడదూరంలో ఉన్నారని అన్నారు. పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షలు రుణాలు ఇవ్వాలన్నారు. ఇలాంటి అనేక సమస్యల పరిష్కారం కోసం ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు రిలే దీక్షలు నిర్వహిస్తామన్నారు. అనంతరం జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొదటి రోజున సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివా సులు, కార్యవర్గ సభ్యులు మారుతి ప్రసాద్, కసాపురం రమేష్, జగ్గలి రమేష్, రాము నాయక్, ఓబులేసు దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సి.రమేష్, ఐద్వా పట్టణ అధ్యక్షురాలు రంగమ్మ, ఆవాజ్ కమిటీ సభ్యులు అబ్దుల్లా, జకీర్, షాషా, భగత్ సింగ్, ఆటో యూనియన్ నాయకులు రాజేష్, ఆటో మల్లి, చరణ్, నాగార్జున, చిరు వ్యాపారుల సంఘం నాయకులు తిమ్మప్ప తదితరులు మద్దతు తెలిపారు.










