Jun 07,2023 22:40

'గడపగడపకూ' ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

        అనంతపురం : అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించి, ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించామని అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. బుధవారం నాడు నగరంలోని 5వ డివిజన్‌లో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముగించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలోని 74 వార్డు సచివాయాలతో పాటు నాలుగు పంచాయతీల్లోని 11 గ్రామ సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామని చెప్పారు. గడపగడపకూ కార్యక్రమం ద్వారా దాదాపు 13 నెలల పాటు ప్రజలతో మమేకం అయ్యామని చెప్పారు. ఓ వైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూనే మరోవైపు స్థానిక సమస్యలకు పరిష్కార మార్గాలను చూపామన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించే ఏర్పాటు చేశామన్నారు. అర్హులకు పథకాలు రాకుంటే అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి వచ్చే ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిపై ప్రేమాభిమానులు చూపారన్నారు. గడపగడపకూ కార్యక్రమం సిఎం తీసుకున్న సాహసోపేత నిర్ణయం అని తెలిపారు. ప్రజల సంక్షేమం, అనంతపురం నగర అభివద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో నాలుగేళ్లలో రూ.2200 కోట్లను సంక్షేమం కోసం వెచ్చించినట్లు చెప్పారు. రూ.650 కోట్లతో రోడ్లు, డ్రెయినేజీల అభివద్ధి పనులు చేపట్టామన్నారు. 23 వేల మందికి ఇంటి పట్టాలు అందిచామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ జయలలిత, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నర్సింహయ్య, మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ఫయాజ్‌, వైసీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ స్టేట్‌ డైరెక్టర్‌ గౌస్‌బేగ్‌, జేసీఎస్‌ కన్వీనర్లు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, లక్ష్మన్న, వక్ఫ్‌బోర్డు జిల్లా ఛైర్మన్‌ కాగజ్‌ఘర్‌ రిజ్వాన్‌, బీసీ విభాగం రీజనల్‌ కో ఆర్డినేటర్‌ రమేష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.