
* జీడి రైతుకు కేంద్రం ద్రోహం
* సమస్యలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
* ప్రజలను చైతన్య పరిచేందుకు సిద్ధమైన సిపిఎం
* నేటి నుంచి జిల్లాలో రెండు రోజుల పాటు బస్సు యాత్ర
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో అన్ని తరగతుల ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న ధరలను అదుపు చేయడంలో రెండు ప్రభుత్వాలూ విఫలమయాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలి కొదిలేసి ప్రజలను వంచిస్తున్నాయి. ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న స్టీల్ ప్లాంట్‌ను అమ్మేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తుంటే... రాష్ట్రానికి చెందిన వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు కనీసం నోరు మెదపడం లేదు. కేంద్ర ప్రభుత్వం జీడి పిక్కల దిగుమతుల సుంకాన్ని ఐదు నుంచి 2.5 శాతానికి తగ్గించి రైతులను నష్టపరుస్తున్నా... మూడు పార్టీలూ మాట్లాడటం లేదు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు, హామీల విస్మరణ వంటి అంశాలను వివరించడంతో పాటు ప్రజల ముందు కొన్ని ప్రత్యామ్నయాలు ఉంచాలని నిర్ణయించింది. అందులో భాగంగా లౌకిక వాదం, ప్రజా స్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం నినాదాలతో ప్రజారక్షణ భేరి యాత్రకు పూనుకుంది.
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : జిల్లాలో జలవనరుల పుష్కలంగా ఉన్న వాటిని పూర్తి స్థాయిలో వినియోగించలేని పరిస్థితి నెలకొంది. వంశధార ఫేజ్-2, స్టేజ్-2 ప్రాజెక్టు ఆఫ్‌షోర్ రిజర్వాయర్ల నిర్మాణాలు ఏళ్ల తరబడి సాగుతున్నాయి. ఆయకట్టు స్థిరీకరణ, అదనపు ఆయకట్టు నీరు ఇవ్వాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. వంశధార ఫేజ్-2 స్టేజ్-2 నిర్మాణాన్ని 2006లో రూ.935 కోట్లతో ప్రారంభించారు. ఇప్పుడు దాని అంచనా వ్యయం రూ.2048 కోట్లకు పెరిగింది. అంచనా వ్యయం పెరిగినా అదనంగా ఒక ఎకరా ఆయకట్టు మాత్రం పెరగలేదు. ప్రాజెక్టుకు సంబంధించి 87 ప్యాకేజీ పనులు 90 శాతం, 88 ప్యాకేజీ పనులు 94 శాతం జరిగాయి. హిరమండలం రిజర్వాయరు పనులు 95 శాతం పూర్తయ్యాయి. పనుల ఒప్పందాన్ని వచ్చే ఏడాది జూన్‌కు పొడిగించారు. ఆఫ్‌షోర్ పరిస్థితి అలానే ఉంది. 2007లో రూ.127 కోట్లతో ప్రారంభిం చిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం రూ.852 కోట్లకు చేరింది. పనులు మాత్రం 45 శాతమే జరిగాయి.
అపరిష్కృతంగా ఆఫ్‌షోర్ నిర్వాసితుల సమస్యలు
ఆఫ్‌షోర్ నిర్వాసితుల సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. పలాస మండలంలోని రేగులపాడు వద్ద నిర్మిస్తున్న ఆఫ్‌షోర్ రిజర్వాయరు నిర్మాణ పనులతో పలాస మండలం రేగులపాడు, నందిగాం మండలం శారదాపురం, చిన్నగురువూరు, మెళియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామాల ప్రజలకు రామకృష్ణాపురం రెవెన్యూ పరిధిలో ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. 250 ప్లాట్లు ఏర్పాటు చేసి నిర్వాసితులకు అప్పగించారు. ప్రస్తుతం శారదాపురంలోని 109 కుటుంబాలు, చిన్నగురువూరులోని 34 కుటుంబాలు, రేగులపాడులో 40 కుటుంబాలు, చీపురుపల్లిలోని 64 కుటుంబాలు కాలనీకి వచ్చేందుకు ముందుకొచ్చాయి. సిసి రోడ్లు, తాగునీటి సౌకర్యం వంటి మౌలిక సౌకర్యాలను పూర్తిస్థాయిలో కల్పించలేదు. మౌలిక వసతులకు రూ.42.89 కోట్లను కేటాయించాల్సి ఉండగా రూ.6.6 కోట్లను కేటాయించింది.
జీడి రైతులను దగా చేస్తున్న పాలకులు
జీడి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తున్నాయి. విదేశీ జీడి పిక్కల దిగుమతులపై సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం ఐదు నుంచి 2.5 శాతానికి తగ్గించడంతో విదేశాల నుంచి జీడి పిక్కలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. దీంతో ఇక్కడి పిక్కలకు డిమాండ్ తగ్గింది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన జీడి పంటకు మద్దతు ధర ప్రకటించకుండా, కొనుగోళ్లు చేయకుండా దళారుల దయాదాక్షిణ్యానికి వదిలేస్తోంది. ఏప్రిల్ రెండో వారం వరకు 80 కేజీల బస్తాకు రూ.10,500 వరకు చెల్లించారు. పంట చేతికి రావడం, రైతుల వద్ద పుష్కలంగా పిక్కలు ఉండటంతో క్రమేణా ధర తగ్గిస్తూ రూ.8 వేలే చేతిలో పెట్టారు. మద్ధతు ధర ప్రకటిస్తాం, ఆర్‌బికెల ద్వారా కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం తరుపున మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మూడేళ్లుగా ప్రకటిస్తూ రైతులను వంచిస్తున్నారు.
మందస ప్రాంతంపై పాలకుల నిర్లక్ష్యం
ప్రభుత్వాలు మారుతున్నా మందస ప్రాంతంపై పాలకుల నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. మందస మండలం దేవుపురం వద్ద రాయికిల్లోయిగెడ్డకు అడ్డంగా కొత్త చిన్న నీటి పారుదల చెరువు నిర్మించి 860 ఎకరాలకు నీరు ఇచ్చేందుకు 2007 నవంబరులో రూ.4.37 కోట్లను కేటాయించారు. ఇప్పటివరకు దీనికి అతీగతీ లేకుండాపోయింది. వీటితో పాటు కళింగదల్ ఎడమ ప్రధాన కాలువమీద జగదేవ బట్టి చీపిగెడ్డ వద్ద అక్కిడెక్ట్, జంతిగెడ్డకు అడ్డంగా కొత్త చెరువు నిర్మాణమూ అటకెక్కింది. అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కై గిరిజనుల భూములను ఆక్రమించకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటితో పాటు గిరిజన ప్రాంతాల్లో ఒడిశాతో సరిహద్దు సమస్య ఉన్నా వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై గిరిజనుల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజా రక్షణ భేరి యాత్ర షెడ్యూల్ ఇలా
ప్రజా రక్షణ భేరి పేరిట సిపిఎం ఆధ్వర్యాన చేపట్టిన బస్సు యాత్ర జిల్లాలో రెండు రోజులు పాటు కొనసాగనుంది. తొలుత మందసలో గురవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మందస బస్టాండ్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు ముఖ్య అతిథిగా సిపిఎం అఖిల భారత నాయకులు విజూ క్రిష్ణన్ పాల్గొనున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, బి.తులసీదాస్, కె.లోకనాథం, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.వి.నాగేశ్వరరావు, కె.ధనలక్ష్మి పాల్గొని మాట్లాడనున్నారు. అనంతరం అక్కడ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు కాశీబుగ్గ బస్లాండ్‌కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు టెక్కలి, సాయంత్రం నాలుగు గంటలకు కోటబొమ్మాళి చేరుకుంటారు. సాయంత్రం ఆరు గంటలకు శ్రీకాకుళం చేరుకుని ఏడు రోడ్ల కూడలి వద్ద నిర్వహించునున్న సభలో ప్రసంగించనున్నారు. మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకు చిలకపాలెం కూడలిలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు. తర్వాత విజయనగరం చేరుకోనున్నారు.