Nov 03,2023 23:14

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి: గారాబంగా పెంచిన తన కుమారైను ప్రేమికునికి ఇచ్చి వివాహం చేసేందుకు తండ్రి నిరాకరించాడు. కారణంగా ప్రేయసి తండ్రిని ప్రియుడు కిరాతకంగా హతమార్చిన సంఘటన శుక్రవారం బైరెడ్డిపల్లిలో వెలుగుచూసింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని నాసుకుప్పం గ్రామానికి చెందిన ఉజినప్ప గౌడ్‌(38) వారం రోజుల నుంచి కనిపించలేదు. అతని కుటుంబీకులు ఆందోళనతో బంధువులు, తెలిసిన వాళ్లను విచారించారు. ఆచూకి దొరకక పోవడంతో వారం రోజులు ముందు ఉజినప్ప సోదరుడు సోమశేఖర్‌ గౌడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు ధర్యాప్తు ముమ్మరం చేశారు. ఉజినప్ప కుమారై ప్రేమ విషయంగా తగవులు జరుగుతున్నాయని, ప్రియుడు గణేష్‌ ఏమైనా చేసుంటాడని స్థానికంగా దుమారం రేగుతుంది. ఆ విషయాన్ని ఆరాదీసిన పోలీసులు గణేష్‌ని అదుపులోకి తీసుకొని విచారించారు. ఉజినప్పను హతమార్చి లక్కినపల్లి పెద్దచెరువులో ఇసుకదిబ్బలో పాతిపెట్టినట్లు ఒప్పుకున్నాడు. శుక్రవారం గణేష్‌ చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా చెరువులో పాతి పెట్టినచోట ఉజినప్ప మృతదేహాన్ని పోలీసులు వెలికితీయించారు. తహశీల్దార్‌ కుమారస్వామి సమక్షంలో మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం చేశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిస్సింగ్‌ కేసును హత్య కేసుగా ఆల్‌టర్‌ చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణమోహన్‌ తెలిపారు. హత్య సంఘటనలో ఇంకా ఎవరైనా ఉన్నారనే కోనంలో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ధర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ స్పష్టం చేశారు. కేసు ధర్యాప్తులో ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ పాల్గొన్నారు.