పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత: కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: ప్రస్తుతం వర్షాకాలంలో ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెత్త సేకరణ జరుగుతున్న తీరును పరిశీలిస్తూ డ్రైడే రోజున నీటి నిల్వలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ అన్నారు. కలెక్టర్ శనివారం సాయంత్రం పట్టణంలోని 6,7 వార్డు సచివాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ని ఇళ్లు ఉన్నాయని ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతుందా లేదా అని ఉన్న వీధుల పొడవు తెలుసుకొని ఆప్రాంతాలలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నారా లేదా అని సాయంత్రం పూట వీధి కాలువలను శుభ్రం చేస్తున్నారా లేదా అని పరిశీలించాలన్నారు. ఏదైనా ఇబ్బందికర పరిస్థితులుంటే వెంటనే పైవారికి తెలియజేసి అందుకు చేపట్టవలసిన చర్యల గురించి తెలుసుకొని వెంటనే ఆచరణలోకి తీసుకువస్తే ప్రజలను వ్యాధుల నుంచి బయటకి తీసుకురాగలమని కలెక్టర్ అన్నారు. 7వ డివిజన్లో 926, 6వ డివిజన్లో 768 ఇళ్ళు ఉన్నాయని ప్రతి ఇంటిలోనూ చెత్త సేకరణ సక్రమంగా జరిగేటట్లు చూడాలన్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులతో పాటు అనర్హులకు సంబంధించి వారి వివరాలు పొరపాటున ఏమైనా చేసి ఉంటే తిరిగి పంపాలని అన్నారు. రాష్ట్రప్రభుత్వం ఆశయం మేరకు అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని ఆ విధంగా అందేటట్లు తగుచర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించి అనారోగ్యం పాలు కాకుండా చూడాలన్నారు. తహశీల్దార్ పార్వతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










