Sep 07,2022 22:58

పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత: కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

జిల్లాలోని పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నదని, జిల్లాస్థాయి కమిటీ తనిఖీలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ యం.హరినారాయణన్‌ పేర్కొన్నారు. బుధవారం అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిశ్రమల భద్రత పై విద్యుత్‌, అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, భూగర్భ గనులశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, కార్మిక శాఖ మంత్రి జయరాం అన్ని జిల్లాల కలెక్టర్లతో పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. చిత్తూరు జిల్లా నుండి కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 857 పరిశ్రమల కలవని, అందులో 37,365 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరిలో 29,496 మంది పురుషులు, 7,869 మంది మహిళలు పనిచేస్తున్నారని తెలిపారు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా రానున్న 90రోజుల్లో ఫ్యాక్టరీల్లో తనిఖీలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. అనంతరం అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు పూర్తి భద్రత కల్పించేలా అన్ని ప్రమాణాలను పరిశ్రమల యజమానులు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా పరిశ్రమల భద్రతా కమిటీకి కలెక్టర్‌ చైర్మన్‌గా జిల్లా పరిశ్రమల అధికారి, కార్మికశాఖ అధికారి, ఇన్స్పెక్టర్‌ఆఫ్‌ ఫ్యాక్టరీలు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఇంజనీరు సభ్యులుగా ఉండాలని తెలిపారు. ఈ సమీక్షలో ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ శివశంకర్‌ రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి చంద్రశేఖర్‌, జిల్లా కార్మికశాఖ అధికారి ఓంకార్‌ రావు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఏఈఈ మధన్‌మోహన్‌ పాల్గొన్నారు.