తాడిపత్రి రూరల్ : తాడిపత్రి మండలం భోగసముద్రం వద్ద ఉన్న సుగ స్పాంజ్ అండ్ పవర్ ప్లాంట్ ప్రతిపాదిత విస్తరణ వద్దే.. వద్దంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఇప్పటికే పరిశ్రమ కాలుష్యంతో పొలాలు పంటలు లేకుండా పోయాయని, ఇప్పుడు మళ్లీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే పూర్తిగా నష్టపోతామని ప్రజాభిప్రాయ సేకరణలో మూకుమ్మడిగా తీర్మానం చేసి అధికారులకు తెలిపారు. కాగ ప్రస్తుతం ఆ ప్లాంట్‌లో శాశ్వత ఉద్యోగులుగా పని చేస్తున్న కొందరు 2వ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరడంతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి తెలుపుతున్న వారిపై గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రసాభాసగా మారడంతో అధికారులు కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించి వెళ్లిపోయారు.
రసాభాసగా ప్రజాభిప్రాయ సేకరణ
భోగసముద్రం వద్ద ఉన్న సుగ స్పాంజ్ అండ్ పవర్ ప్లాంట్ విస్తరణలో భాగంగా 2వ ప్లాంట్ ఏర్పాటు కోసం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ 2006 సెప్టెంబర్ నోటిఫికేషన్ మేరకు గురువారం నాడు పరిశ్రమ ఆవరణలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భోగసముద్రం పంచాయతీ పరిధిలోని గ్రామాల రైతులు, ప్రజలు, రెవెన్యూ, ఎంపీడీవో, సచివాలయ అధికారులు, ఎన్జీవోలు, పర్యావరణ ప్రేమికులు ఇందులో పాల్గొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా పలువురు వారి అభిప్రాయాలను నేరుగా జాయింట్ కలెక్టర్‌కు విన్నవించారు. ప్రస్తుతమున్న పరిశ్రమ నుంచి వెదజల్లే కాలుష్యం వల్ల సమీపంలోని పంటపొలాలు పూర్తి స్థాయిలో దెబ్బతింటున్నాయని చెప్పారు. దీనికి తోడు కాలుష్యంతో గ్రామస్తులు చర్మ, కళ్లు సంబంధిత వ్యాధులతో రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమ విస్తరణ పేరుతో 2వ ప్లాంట్ ఏర్పాటు చేస్తే మరింత ఇబ్బందులకు గురవుతామని చెప్పారు. ఇదే సమయంలో కొందరు పరిశ్రమ ఏర్పాటు వల్ల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఈ నేపథ్యంలో విస్తరణకు అనుమతులు ఇవ్వాలని కోరారు. దీంతో ఒక్కసారిగా పరిశ్రమ ఏర్పాటును వద్దేనే వారు కావాలనే వారిపై నిరసనకు దిగారు. పరిశ్రమ విస్తరణకు అనుకూలంగా అభిప్రాయం వెల్లడించిన వారిపై చెప్పులు విసిరారు. వెంటనే డీఎస్పీ సిఎం.గంగయ్య ఆధ్వర్యంలో సిఐలు లక్ష్మికాంతరెడ్డి, ఆనందరావు, శంకర్‌రెడ్డిలు సిబ్బందితో కలసి వారిని అడ్డుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని వారికి సర్ధిచెప్పారు.
అందరూ అభిప్రాయాన్ని తెలపొచ్చు : జెసి
పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయాన్ని తెలపొచ్చని జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్ తెలిపారు. అభిప్రాయాలు తెలుసుకునే ప్రాంతంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం సరికాదన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడించే ప్రతి అభిప్రాయాన్నీ నమోదు చేసి, ఎంఎఫ్‌కు పంపుతామన్నారు. మరో రెండు రోజుల పాటు కలెక్టరేట్ వద్దకొచ్చి కూడా అభిప్రాయాలు తెలపొచ్చన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలా.. వద్దా..? అన్నది ఎంఒఎఫ్‌తో పాటు ఇతర శాఖల మీద ఆధారపడి ఉంటుందని వివరించారు.
అర్ధాతరంగా ముగింపు
ఓ వైపు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతుండగానే గ్రామస్తులు పరిశ్రమ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జెసి వారికి ఎంత సర్ధిచెప్పడానికి ప్రయత్నించినా గ్రామస్తులు వినలేదు. దీంతో అధికారులు చేసేది లేక ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఆపేసి అక్కడ నుంచి వెనుదిరిగారు.










