
* స్వచ్ఛత మన నినాదం కావాలి
* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పిలుపునిచ్చారు. స్వచ్ఛత మన నినాదం కావాలని ఆకాంక్షించారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆధ్వర్యాన స్వచ్ఛతా హీ సేవా అభియాన్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్, రెడ్‌క్రాస్, లయన్స్ క్లబ్ అరసవల్లి, రోటరీ క్లబ్ శ్రీకాకుళం ప్రతినిధులు, ఎన్‌సిసి క్యాడెట్స్, పలు కళాశాలల విద్యార్థులతో కలిసి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉన్న చెత్తను స్వయంగా సేకరించి పరిశుభ్రం చేశారు. స్వచ్ఛతా హీ సేవా బ్యానర్‌పై కలెక్టర్ తొలి సంతకం చేశారు. ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామన్నారు. పరిసరాల పరిశుభ్రతలో దశాబ్ద కాలంలో దేశం ఎంతో పరిణితి సాధించిందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలు ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తాయన్నారు. స్వచ్ఛతా హీ సేవా స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని కోరారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. పరిశుభ్రతే మహాత్మునికి మనం ఇచ్చే నివాళి అని అన్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యమన్నారు. ప్రతిరోజూ గంట సమయం పరిసరాల పరిశుభ్రతకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ శాంతిశ్రీ, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సురేఖ, క్షేత్ర ప్రచార అధికారి తారక్ ప్రసాద్, డిఐపిఆర్‌ఓ చెన్నకేశవరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకట్రావు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.