పరీక్షల వేళ బదిలీలా..!
ఉపయోగం లేదని ఉపాధ్యాయుల విమర్శ
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
పాఠశాలల సెలవుల సమయంలోనే బదిలీలు చేయాలని ఉపాధ్యాయులు నెత్తినోరు మొత్తుకున్నా ప్రభుత్వం వినలేదు. ఇప్పుడు మరో మూడు నెలలు పరీక్షలు ఉండగా ఇప్పుడు బదిలీలకు పచ్చజెండా ఊపింది. దీనిపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం కావాలనే సమస్యలను పక్కదారి పట్టించాలని ఎందుకూ కొరగాని బదిలీలను చేపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇందులో అసంబద్ధమైన అంశాలు చాలా ఉన్నాయని, వాటిని తొలగించాలని డిమాండు చేస్తున్నారు.
డిసెంబర్ 12 నుంచి జనవరి 12వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ జరగనుంది. నెల రోజుల పాటు ఈ తంతు సాగనుంది. జిల్లా విద్యాశాఖకు సంబంధించి ఈ నెల12, 13వ తేదీల్లో ఖాళీలను వెల్లడించనున్నారు. ఉపాధ్యాయులు 14 నుంచి 17వ తేదీ వరకు దరకాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు ఐదేళ్లు, ఉపాధ్యాయులు ఎనిమిదేల్లు ఒకే చోట పని చేసి ఉంటే బదిలీ తప్పనిసరి. జీరో సర్వీసు ఉన్నా బదిలీ చేయించుకోవచ్చుని ఆదేశాలున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 700మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఈ లోగా ఆగమేఘాలపై ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగల్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వం కావాలనే ఇలా ఈ సమయంలో బదిలీల ప్రక్రియ చేపట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయులకు 11వ తేదీ వస్తున్నా ఇప్పటి వరకు వేతనాలు రాలేదు. అలాగే సిపిఎస్ రద్దుపైన ఉవ్వెత్తున పోరాడుతున్నారు. అంతేకాకుండా శాసన మండలి ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపణలున్నాయి. వీటన్నింటి నుంచి తప్పించుకునేందుకే ఇప్పుడు ప్రభుత్వం బదిలీలు ప్రక్రియ మొదలు పెట్టిందని విమర్శలు వస్తున్నాయి. బదిలీల కోసం ఉపాధ్యాయులు మూడు నెలలుగా ఎదురు చూస్తున్నారు. సరైన సమయంలో ఉత్వర్వులు జారీ చేయలేదు. అవసరం లేదనుకునే సమయంలో విడుదల చేశారు. పదో తరగతి బోధించే ఉపాధ్యాయులు మధ్యలో బదిలీల వల్ల ఆపేస్తే విద్యార్థులు ఇక్కట్లు పడతారు. కావున వచ్చే ఏడాది వేసవిలో బదిలీలు నిర్వహించాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు.
గత ఏప్రిల్, మేనెలలో నిర్వహించాల్సిన బదిలీలను ఈ డిసెంబర్లో యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని జీవో నెంబర్ 157ను విద్యాశాఖ విడుదల చేసిన నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో వేలాదిగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఉన్నప్పటికీ వాటి భర్తీకి తగిన కషి చేయకుండా విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేపట్టే సందర్భంలో ఎన్నో అసంబద్ధమైన అంశాలను బదిలీల సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యంగా జీవో నెంబర్ 117 ప్రకారం 97 అంతకంటే తక్కువ ఉన్న యూపీ పాఠశాలలో పాఠశాల సహాయకులను సర్దుబాటు పేరుతో ఎలాంటి అదనపు పాయింట్లు లేకుండా చేయడం వారిని చాలా ఆందోళనకు గురిచేస్తున్నదని తెలియజేస్తున్నాం..
- జివి.రమణ యుటిఎఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి










