Jul 07,2023 09:28

విలేకరులతో మాట్లాడుతున్న కాలవ శ్రీనివాసులు

              రాయదుర్గం : జిల్లాలో ఒక్కో రైతు లక్షలాది రూపాయలు పంటలు నష్టపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అరకొర పంటనష్ట పరిహారమిచ్చి రైతుల జీవితాలతో పరిహాసం ఆడుతున్నారని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన రైతులతో కలిసి రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పంటల బీమాను చూస్తే రైతుల కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని చెప్పారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా వాతావరణ బీమా కింద కేవలం రూ. 213 కోట్లు మంజూరైందన్నారు. 2017లో తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లాకు దాదాపు రూ.1100 కోట్ల సహాయాన్ని అందించిదని గుర్తు చేశారు. డి.హీరేహల్‌ మండలం హులికల్లు గ్రామంలో 20 మంది రైతులకు కేవలం రూ.3,148 మాత్రమే పరిహారం ఇచ్చారన్నారు. దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. పదులు, వందల రూపాయలను పంచడానికి ముఖ్యమంత్రి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి జిల్లా పర్యటనకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. 2018 ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.1838.24 కోట్లు విడుదల చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. అందులో రూ. 931 కోట్లు ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులకే పరిహారం కింద అందాల్సి ఉందన్నారు. ఈ ప్రకటన చేసి నాలుగేళ్లు గడుస్తున్నా ఆ పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పరిహారం ఎగ్గొట్టి రైతుల కడుపుకొడుతున్న జగన్‌ రెడ్డికి అనంతపురం జిల్లాలో అడుగుపెట్టే అర్హత లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10:30 గంటలకు అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు నాగరాజు, మండల కన్వీనర్‌ హనుమంతు, జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు జమీల్‌ ఖాన్‌, క్లస్టర్‌ ఇన్‌ఛార్జీలు మోహన్‌ రెడ్డి, ఇనాయత్‌, ఎంపీటీసీ గంగాధర పాల్గొన్నారు.