Mar 07,2022 20:59

సమావేశంలో మాట్లాడుతున్న నేతలు



ఆర్‌ఎంఎస్‌ ఉద్యోగుల రాష్ట్రస్థాయి సభ పిలుపు
ప్రజాశక్తి - తిరుపతి టౌన్‌
ఆర్‌ఎంఎస్‌, ఎంఎంఎస్‌ ఉద్యోగుల (గ్రూప్‌ 3) 34వ రాష్ట్ర మహాసభలు తిరుపతి నగరంలోని ఆఫీసర్స్‌క్లబ్‌లో సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సర్కిల్‌ రాష్ట్ర అధ్యక్షులు పివి రావు అధ్యక్షత వహించారు. మోడీ అధికారంలోకి వచ్చాక స్వాతంత్య్రానంతరం సాధించుకున్న ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు. ఒక్క ప్రభుత్వరంగ సంస్థను నిర్మించలేని మోడీ, అనేక త్యాగాల ఫలితంగా ఏర్పాటైన ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం దశలవారీగా పోస్టల్‌ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. లక్షకు పైగా ఖాళీ పోస్టులు ఉంటే భర్తీ చేయకపోగా, 60వేల మందికి పైగా ఔట్‌సోర్సింగ్‌లో ఏళ్ల తరబడి పనిచేస్తున్నారన్నారు. మోడీ ప్రభుత్వం పోస్టల్‌ రంగాన్ని నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పోటాపోటీగా ఉద్యోగ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిలయాలుగా మారాయన్నారు. 42 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్‌ లుగా మార్చి కేంద్ర ప్రభుత్వం యాజమాన్య అనుకూల అవతారం ఎత్తిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంఎస్‌, ఎంఎంఎస్‌ ఉద్యోగ సంఘాల నేతలు కె.రమేష్‌బాబు, పి.నరసింహులు, సిహెచ్‌ కోటేశ్వరరావు, కుమారస్వామిరెడ్డి, మధుసూదనరావు, రాజేంద్ర, ఉదరుకాంత్‌, మాధవయ్య, భాస్కర్‌రాజు, శ్రీధర్‌, రామచంద్ర, కోటేశ్వర ప్రసాద్‌ పాల్గొన్నారు.