Jun 07,2023 22:31

జెడిఎకు వినతిపత్రం ఇస్తున్న రైతుసంఘం నాయకులు

        అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా పత్తి విత్తనాలు సరఫరా చేయాలని ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వి.శివారెడ్డి, బిహెచ్‌.రాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఉమా మహేశ్వరమ్మను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఖరీఫ్‌లో తాడిపత్రి, పామిడి, పెద్దవడుగూరు, గుత్తి, గుంతకల్‌, యాడికి, పుట్లూరు మండలాల్లో రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కంపెనీలు, ఫర్టిలైజర్స్‌ షాపు యజమానులు కల్తీ, నాశిరకం పత్తి విత్తనాలను ఇచ్చారన్నారు. వ్యవసాయ శాఖ బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టిన కొన్ని కంపెనీల విత్తనాలనూ సరఫరా చేశారన్నారు. దీంతో దిగుబడి రాక రైతులు కోట్లాది రూపాయలు పెట్టుబడులు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి వాటిని నివారించేందుకు ప్రభుత్వమే పత్తి విత్తనాలు సరఫరా చేయాలన్నారు. పత్తి విత్తనాలు, ఇతర విత్తనాలు అన్ని వచ్చిన లాట్‌ శాంపుల్స్‌ తీసి నాశిరకం, మొలకశాతం పరిశీలన చేసిన తరువాతనే రైతులకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విత్తనాల శాంపుల్స్‌ తీయకుండా విక్రయించే ఫర్టిలైజర్స్‌ ఫాపుల లైసెన్సులు రద్దు చేయాలన్నారు. పత్తితో పాటు ఆముదం, మిరప, టమోటా, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న తదితర పంటల విత్తనాలు ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు ఎం.పోతులయ్య పాల్గొన్నారు.