Mar 02,2023 18:28

ప్రజాశక్తి - వీరవాసరం
జగనన్న కాలనీల్లో ఇల్లు నిర్మించు కోలేని వారికి ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. గురువారం మండలం లోని పలు గ్రామాల్లో జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతిని సిపిఎం బృందం పరిశీలించింది. వీరవాసరం పంచాయతీ పరిధిలోని తలతాడితిప్ప, మత్స్యపురి, మత్స్యపురిపాలెం గ్రామాల్లోని జగనన్న లేఅవుట్లను సిపిఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ కాలనీల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదన్నారు. దీంతో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. పెరిగిన ఇంటి నిర్మాణ సామగ్రి ధరలతో ప్రభుత్వం ఇస్తున్న లబ్ధి ఏమాత్రమూ సరిపోదన్నారు. బృందం పర్యటించిన మూడు గ్రామాలలో 360 మందికి స్థలాలు కేటాయిస్తే అందులో 18 మంది మాత్రమే ఇళ్ల నిర్మాణం పూర్తి చేయగా అరవై మంది బేస్‌మెంట్‌ లెవెల్‌ పూర్తి చేశారన్నారు. మిగిలిన లబ్ధిదారులు నిర్మాణం ప్రారంభించలేదన్నారు. ఇళ్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, పట్టాలు వెనక్కి తీసుకుంటామంటూ బెదిరించడం సరికాదన్నారు. పర్యటనలో బాలం విజయకుమార్‌, రెడ్డి రామారావు, బళ్ల చిన వీరభద్రరావు, యాళ్లబండి నారాయణమూర్తి, మైగాపుల త్రిమూర్తులు, బొబ్బనపల్లి సూర్యచంద్రరావు, కవురు సుబ్బారావు పాల్గొన్నారు.