Mar 03,2023 19:00

జగనన్న లేఅవుట్లలో సిపిఎం బృందం పరిశీలన
ప్రజాశక్తి - కాళ్ల
జగనన్న గృహ లబ్ధిదారుల పరిస్థితి దయనీయంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్‌ అన్నారు. ఏలూరుపాడు, కాళ్లకూరు, కాళ్ల, కొలనపల్లి గ్రామాల్లోని జగనన్న లేఅవుట్లను శుక్రవారం సిపిఎం నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు పలు సమస్యలను సిపిఎం నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఊరికి దూరంగా సెంటున్నర స్థలం ఇచ్చి, అరకొరగా పూడిక చేసి, ఇల్లు కట్టుకోకపోతే స్థలాలను వెనక్కి తీసుకుంటామని అధికారులు బెదిరించడం సరికాదన్నారు. ఒక పక్క అధికారుల బెదిరింపులు తాళలేక, మరోపక్క ఇళ్లు నిర్మించుకోలేక లబ్ధిదారులు సతమతమవుతున్నారన్నారు. ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని, లేనిపక్షంలో ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు అందించాలని డిమాండ్‌ చేశారు. ఇళ్ల స్థలాలు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా కనీసం పూడిక చేయకపోవడం దుర్మార్గమన్నారు. గ్రామానికి దూరంగా నివాసయోగ్యం లేనిచోట లేఅవుట్‌ ఏర్పాటుచేసి ఇళ్ల స్థలాలు అందజేయడం దారుణమన్నారు. తక్షణం ప్రభుత్వం ఇంటిని నిర్మించి ఇవ్వాలని, లేనిపక్షంలో రూ.6 లక్షలు ఇంటి నిర్మాణం నిమిత్తం లబ్ధిదారులకు అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ, సిపిఎం మండల కమిటీ తిరుమాని శ్రీనివాస్‌, మోకా కోటేశ్వరరావు, ఏసురత్నం పాల్గొన్నారు.