ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి..
కార్మికుల అర్థనగంగా నిరసన
రెండో రోజు కొనసాగిన సమ్మె
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ రాష్ట్ర కార్మికసంఘాల జేఏసీ పిలుపు మేరకు సమ్మెను కొనసాగించారు. ప్రభుత్వ తీరును నిరశిస్తూ గాంధీ విగ్రహం ఎదుట మున్సిపల్, పారిశుధ్య కార్మికులు అర్థనగంగా ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు కాంజివరం సురేంద్రన్, యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎస్.నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పారిశుధ్యం కార్మికుల సమస్యల పట్ల మొండి వైఖరిని విడనాడాలని హితవు పలికారు. స్థానిక అధికారులు సమస్యలు పరిష్కరించడంలో చూపాని చొరవ సమ్మెను నిర్వీర్యం చేయడానికి కార్మికులను బెదిరించదానికి చూపుతున్నారని విమర్శించారు. కార్మికులందరూ సమ్మెలో ఉంటే ప్రైవేట్ వ్యక్తులను ప్రోత్సహించి కార్మికులకు ప్రైవేటువ్యక్తుల మధ్య తగాదా పెట్టడానికి చూస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. రానున్న వర్షాకాలంలో ప్రజలకు అంటువ్యాధులు సోకకుండా వెంటనే కార్మికసంఘాల నాయకత్వాన్ని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి సమస్యను పరిష్కరించకపోగా సమస్యలను సష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు కార్మికులు వంటావార్పుతో నిరసన వ్యక్తం చేశారు.
కుప్పం: కుప్పం మున్సిపల్ కార్యాలయం ముందు మంగళవారం రెండవ రోజు మున్సిపల్ కార్మికులు సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా సిఐటియు కుప్పం నియోజకవర్గ అధ్యక్షులు గోవిందరాజు, కార్యదర్శి పార్తీభన్‌లు మాట్లాడుతూ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు నరసింహులు, భారత్, గుణశేఖర్, మంజుమ్మ, హేమవతి, వెంకటేష్ పాల్గొన్నారు.
పుంగనూరు: మున్సిపల్ కార్మికుల రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా రెండో రోజు పుంగనూరు మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు మోకాళ్లపై నిలబడి తమ నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా మంత్రుల తీరును నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఏఐటీయూసీ పట్టణ అధ్యక్షుడు పి.శ్రీరాములు, రెడ్డెప్ప, సుమన్, సాధిక్, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
పలమనేరు: పలమనేరు మున్సిపల్ కార్యాలయం ఎదుట రెండవ రోజు మున్సిపల్ కార్మికులు సమ్మెను కొనసాగించారు. ఈసందర్భంగా ఏఐటీయూసీ నాయకులు చెన్నకేశవులు, సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదని అన్నారు. కార్మికుల న్యాయమైన కోరికలను, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బుర్ర మంజునాథ్‌బాబు, శ్రీనివాసులు, సూరి, బాలాజీ, వాసు, జాన్ ఆనంద్, సరస్వతి, గంగులమ్మ పాల్గొన్నారు.










