Oct 12,2023 21:03

రోగులతో మాట్లాడుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - గార: 
ప్రభుత్వాస్పత్రుల్లో మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందించడంలో సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు. మండలంలోని తూలుగులో గురువారం నిర్వహించిన ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పరిశీలించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరు గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబం దగ్గరకు వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలను పంపించడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక కేటాయింపులు చేస్తోందన్నారు. నిధుల వెచ్చింపుల్లో ఎక్కడా వెనుకంజ వేయడం లేదని తెలిపారు. ఇప్పటికే రిమ్స్‌లో అధునాతన పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్యారోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో డిసిఎంఎస్‌ చైర్మన్‌ గొండు కృష్ణమూర్తి, ఎంపిపి గొండు రఘురాం, జెడ్‌పిటిసి మార్పు సుజాత, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్‌ ముంజేటి కృష్ణమూర్తి, వైసిపి మండల అధ్యక్షులు పీస గోపి తదితరులు పాల్గొన్నారు.