తాడిపత్రి రూరల్ : ప్రభుత్వ విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నాయని, ఇలాంటి సమయంలో ప్రభుత్వ విద్య పరిరక్షణకు పోరాటాలే మార్గం అని మాజీ ఎమ్మెల్సీ డా||గేయానంద్ తెలిపారు. జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు చేపట్టిన ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంగ్రామ సైకిల్ యాత్ర బుధవారం నాడు తాడిపత్రిలో ప్రారంభం అయ్యింది. తాడిపత్రి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుంచి ప్రారంభమైన యాత్రను గేయానంద్ జెండా ఊపి ప్రారంభించారు. మొదటి రోజు నంద్యాల రోడ్డు మీదుగా మండలంలోని చుక్కలూరు, ఇగూడూరు గ్రామాల మీదుగా యాడికి, రాయల చెరువు, క్రిష్టిపాడు గ్రామాల మీదుగా రాత్రి గుత్తికి చేరుకుంది. సైకిల్ యాత్రకు అన్ని ప్రాంతాల్లోనూ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గేయానంద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ ప్రభుత్వం పేదలను విద్యకు దూరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేజీబీవీల్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు లేరన్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం అడుగడుగునా నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందన్నారు. దీనిని నిరసిస్తూ ప్రభుత్వ విద్యను కాపాడుకునేందుకు విద్యార్థులు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఓతూరు పరమేష్ మాట్లాడుతూ విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నేటికీ అందలేదన్నారు. జీవో నెంబర్ 77ను తీసుకొచ్చి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేశారన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు వైటిసి.రమేష్ మాట్లాడుతూ నూతన విద్యా విధానాన్ని రద్దుచేసి ప్రభుత్వ విద్యారంగాన్ని అభివద్ధి చేయాలని కోరారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్‌యాత్ర తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ఉరవకొండ, కనేకల్, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఆత్మకూరు మీదుగా అనంతపురం వరకు కొనసాగుతుందని చెప్పారు. 350 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసి విద్యార్థుల సమస్యలను అధికారుల దష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు శివ, ఉపాధ్యక్షులు వరుణ్, నాయకులు సిద్ధార్థ, గిరిబాబు, సునీత, శివ, భీమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.










