Oct 10,2023 22:30

నిరసన తెలుపుతున్న విఒఎలు

* మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దు చేయాలి
* కలెక్టరేట్‌ వద్ద విఒఎల 36 గంటల ధర్నా
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
వెలుగు సంస్థలో పనిచేస్తున్న విఒఎలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, విఒఎల సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ప్రభావతి, జి.అసిరినాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్‌ వద్ద 36 గంటల ధర్నా, వంటావార్పు కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. సిబిఒహెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, రూ.పది లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, అన్నిరకాల బకాయిలు తక్షణమే చెల్లించాలని, లోకో యాప్‌ వర్క్‌ కోసం 5జి మొబైల్‌ను ప్రభుత్వమే ఇవ్వాలని విఒఎలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విఒఎల ఉపాధిని దెబ్బతీసే మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దు చేయాలన్నారు. విఒఎల ఉపాధికి నష్టదాయకమైన గ్రామ సమాఖ్యల విలీనాన్ని ఆపాలన్నారు. సంఘాలను విడగొట్టడం కలపడం వంటి చర్యలు సెర్ఫ్‌ అధికారులు చేయడం సరికాదన్నారు. దీనివల్ల వేలాది మంది విఒఎలు ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. ఎక్కువ సంఘాలున్న విఒఎల నుంచి తక్కువ సంఘాలున్న విఒఎలకు సర్దుబాటు చేయాలని, రాజకీయ జోక్యం లేకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకు 15 సంఘాల్లోపు ఉన్న విఒఎలకు వేతనాలు చెల్లించడం లేదని, వారంతా ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విఒఎగా పనిచేస్తూ ఉపాధి కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వయసు పైబడిన వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుటుంబ సభ్యులకు విఒఎలుగా అవకాశం కల్పించాలన్నారు. జెండర్‌, వయసు, చదువు పేరుతో తొలగింపులు ఆపాలన్నారు. మహిళా మార్టుల్లో బలవంతపు కొనుగోళ్లు, విఒఎలకు లక్ష్యాలు నిర్దేశించే పద్ధతి ఆపాలన్నారు. గౌరవ వేతనం ఎం.ఎన్‌ అకౌంట్స్‌లో వేయకుండా చెల్లింపు చెక్కులు ఇవ్వాలని, వాటిపై సిసి, ఎపిఎం సంతకాలు లేకుండా చూడాలని కోరారు.రికవరీ పేరుతో వేతనాల్లో కోతలు ఆపాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, జిల్లా కార్యదర్శి ఎన్‌.వి రమణ, విఒఎ సంఘ నాయకులు జి.భవాని, డి.జోగారావు, కె.సీతమ్మ, ఎస్‌.లక్ష్మి, పి.రమాదేవి, జి.ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.