Mar 15,2022 18:13

కొల్లాగుంట సచివాలయాన్ని తనిఖీ చేస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ రాజబాబు

- జాయింట్‌ కలెక్టర్‌ రాజబాబు
ప్రజాశక్తి- కార్వేటినగరం :
ప్రభుత్వం అందించే ప్రతి పథకం ప్రజలకు అందే విధంగా చూడాలని జాయింట్‌ కలెక్టర్‌( రెవిన్యూ )రాజబాబు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొల్లాగుంట గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో సమీక్షించారు. అనంతరం అయన మాట్లాడుతూ సిబ్బంది జవాబుదారి తనంగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వం నుంచి ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాలని ఆదేశించారు. అదే విధంగా ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం పంపిణీ సకాలంలో అందించాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా ఓటిఎస్‌ విధివిధానాలను అడిగి తెలుసుకుని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆళత్తూరు, కత్తెరపల్లి, కార్వేటినగరం సచివాలయాల్లోనే రికార్డులతో పాటు ఆయన పరిధిలో నిర్మాణాలు చేపడుతున్న కాలనీలను సందర్శించి మౌలిక వసతులు ఏర్పాటుపై ఆరా తీశారు. ఆయన వెంట ఎంపీడీవో చిన్నరెడ్డెప్ప, తహసీల్దార్‌ అమరేంద్ర బాబు, ఈవో నాగరత్నమ్మ, లోకేష్‌, సచివాలయ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.