ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాలి
మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీ రెడ్డప్ప
ప్రజాశక్తి- వికోట: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అర్హులందరికీ అందచేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు అధికారులపై ఉందని ఎంపీ రెడ్డప్ప తెలిపారు. స్థానిక మండల పరిషత్ ప్రాంగణంలోని శ్రీశక్తి భవనంలో బుధవారం ఎంపీపీ యువరాజ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలపరిధిలోని అన్నిశాఖల అధికారులు వారివారి ప్రగతి నివేదికలను వివరించారు. ఎంపీ మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఇరిగేషన్ ఇంజనీరు మండలంలో ఉన్న చెరువుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నివేదికలు సమర్పించాలని ఎంపీపీ ఆదేశించారు. అంగన్వాడీ పాఠశాలల్లో పోషకాహార లోపం లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా క్షేత్రస్థాయిలో ఐసిడిఎస్ అధికారులు నిరంతరం పర్యవేక్షించి మండల పరిషత్‌కు ప్రగతి నివేదికలు అందజేయాలని సూచించారు. అగ్రికల్చర్ హార్టికల్చర్ సిరికల్చర్ అధికారులు రైతులకు ప్రభుత్వ పథకాలు గురించి సంపూర్ణమైన అవగాహన కలుగచేయాలని సచివాలయాల స్థాయిలలో సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రతిరోజు సాయంత్రం స్పందన కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఈసందర్బంగా వీకోట మండలం మీదుగానే జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచులతో పాటు మండల పరిషత్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి కాపీలను ఎంపీకి అందజేశారు. దీనిపై స్పందించిన వారు ఢిల్లీ స్థాయిలో తనవంతు ప్రయత్నాలు చేసి వికోట మండలం మీదుగానే జాతీయ రహదారి ఏర్పాటుకు తన వంతు కషి చేస్తానని సభ్యులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ ప్రత్యేక ఆహ్వానితులు గౌస్, రాష్ట్రరోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలగురునాథ్, వైస్ ఎంపీపీలు లక్ష్మణ్ రెడ్డి, తమిమ్ ఖాన్, సింగల్ విండో ప్రెసిడెంట్లు గోపిరెడ్డి, దవనం భక్తవస్థలం, ఎంపీడీఓ బాలాజీ , తహసీల్దార్ సీతారామయ్య, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.










