Sep 23,2023 21:54

ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలు
అక్టోబర్‌ 30 నాటికి పూర్తి చేయాలి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ క్లినిక్స్‌ వంటి ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలు అక్టోబర్‌ 30 నాటికి పూర్తిచేసి సంబంధిత శాఖలకు అందజేయాలని జిల్లా కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌ పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశం హాల్‌లో జెసిపి శ్రీనివాసులు, పంచాయతీ రాజ్‌శాఖ ఎస్‌ఈ, కె.చంద్రశేఖర్‌ రెడ్డి, ఈఈ ఎం.చంద్రశేఖర్‌ రెడ్డిలతో కలసి జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలు సచివాలయాలు, ఆర్‌బికెలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ పనులకు సంబంధించి పంచాయతీరాజ్‌ శాఖ ఎస్‌ఈ, ఈఈ, డీఈలు, ఏఈలు, ఎంపిడిఓలు, మున్సిపల్‌ కమీషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి మండలానికి వారానికి నిర్దేశించిన లక్ష్యాలను ఆవారం లోగానే పూర్తి చేయాలని ఎంపిడిఓలను, ఇంజనీర్లు ఆదేశించారు. పూర్తిచేసిన భవనాలను అక్టోబర్‌ 30 నాటికి సంబందితా శాఖలకు అందజేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు నిర్మించిన భవనాల నిర్మాణాలకు సంబంధించి నిధులు పెండింగ్‌ లేకుండా చూడాలని, 15 రోజులలో బిల్స్‌ ఆన్‌ లైన్లో అప్డేట్‌ చేసి క్లియర్‌ చేయాలన్నారు. ఈసందర్భంగా జెసి మాట్లాడుతూ ఎంపిడిఓలు, పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీర్లు కాంట్రాక్టర్లు వెంటపడి తొందరగా పూర్తి చేసి బిల్స్‌ పెండింగ్‌ లేకుండా ఎప్పటికప్పుడు ఆన్‌ లైన్లో అప్డేట్‌ చేయాలని, అప్డేట్‌ అయినా బిల్స్‌ కు సంబంధించి 15 రోజులలో కాంట్రాక్టర్లకు పేమెంట్‌ అందేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్‌శాఖ ఇంజనీర్లును ఆదేశించారు. 72 సచివాలయాలు, 58 రైతు భరోసా కేంద్రాలు, 72 వైఎస్సార్‌ హీల్త్‌క్లినిక్‌ భవనాలకు సంబంధించి ప్లమింగ్‌, విద్యుత్‌, చిన్నచిన్న పనులను ఉన్న వాటిని అక్టోబర్‌ 10నాటికి పూర్తిచేయాలన్నారు. జిల్లాలో 519 సచివాలయ భవనాల నిర్మాణాలకు గానూ ఇప్పటివరకు 278 భవనాలు పూర్తి చేయడం, 504 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు గానూ 272 భవనాలు పూర్తి చేయడం జరిగిందని, 351 వై.యస్‌.ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ల భవనాలకు గానూ 79 భవనాలు పూర్తి చేయడం జరిగిందని, మిగిలినవి ప్లామింగ్‌, విద్యుత్‌ కనెక్షన్లు, ఫీనిషింగ్‌, సెకండ్‌ స్లాబ్‌ వివిధ దశలలో పనులు జరుగుతున్నాయని, కలెక్టర్‌ నిర్దేశించిన సమయానికి లక్ష్యాలను పూర్తి చేయడం జరుగుతుందని పంచాయతీరాజ్‌ శాఖ ఎస్‌ఈ చంద్ర శేఖర్‌రెడ్డి వివరించారు.