May 15,2023 22:44

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమి

ప్రజాశక్తి అనంతపురం కలెక్టరేట్‌ : ప్రభుత్వ కార్యక్రమాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు కృషి చేద్దామని జిల్లా కలెక్టర్‌ అధికారులకు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్‌ లోని రెవెన్యూ భవన్‌ లో మండల స్పెషల్‌ ఆఫీసర్లు, మండల అధికారులతో ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా రెవెన్యూ అంశాలు, ఉపాధి హామీ పనులు, గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై సమీక్ష కొనసాగింది.
రెవెన్యూ శాఖకు సంబంధించి 12 వేల ఎకరాల పైచిలుకు చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం అభినందనీయమన్నారు. జాతీయ రహదారులు, పరిశ్రమల ఏర్పాటు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాల కోసం భూసేకరణ కార్యక్రమం వేగవంతం చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు. ఎంఐజీ లేఅవుట్లకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే పంపించాలన్నారు.
జిల్లా విభజన తర్వాత జిల్లాలో పరిశ్రమల అవసరం పెరిగిందని, పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏపీఐఐసీకి తగినంత స్థలం అందించాలని అన్నారు. ఇప్పటికే ఆమోదించిన జగనన్న హౌసింగ్‌ లే అవుట్లలో నూతన లబ్ధిదారులకు ఇళ్ల పట్టా ఇచ్చే కార్యక్రమం చేపట్టాలన్నారు. నీటి ప్రాజెక్టుల కోసం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పనులు సమస్యలు లేకుండా పూర్తి చేయాలన్నారు. న్యాయ సమస్యలు ఎదురైనప్పుడు త్వరితగతిన కౌంటర్లు వేస్తూ కేసులు కొలిక్కి వచ్చేలా చూడాలన్నారు. రీ సర్వే త్వరిత గతిన పూర్తి చేసి సర్వే రాళ్లు పాతాలన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ శాతం మెరుగు పరచాలన్నారు. ఎస్డీజీ సర్వే యాప్‌ అప్డేట్లపై సిబ్బందికి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. మహిళా సాధికార కార్యక్రమాలు బాల్య వివాహాలు, టీనేజీ ప్రెగెన్సీలు వంటి సామాజిక దురాచారాలపై చైతన్యం కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌, డీఆర్వో గాయత్రీ దేవి, జెడ్పీ సీఈవో భాస్కర్‌ రెడ్డి, సీపీవో ప్రేమ్‌చంద్‌, డీఈవో సాయిరాం, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ భాగ్యరాజ్‌, మండల స్పెషల్‌ ఆఫీసర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.