ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప తెలిపారు. గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గురుకుల పాఠశాల, నార్పల మండలం బి.పప్పూరు గురుకుల పాఠశాల, గుత్తి మండలం రజాపురం గురుకుల పాఠశాలల వద్ద కెవిపిఎస్, ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ (అప్పా) ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకుని పేద విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం కెవిపిఎస్, అప్పా కమిటీలు సంయుక్తంగా మంచినీరు, మజ్జిగను పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే ఆయా పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు అరటిపండ్లు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. అంబేద్కర్ చెప్పినట్టు అధ్యయనం, సమీకరించడం, ఉద్యమించడం అనే లక్ష్యాలను కెవిపిఎస్, అప్పా కమిటీలు కొనసాగిస్తున్నాయన్నారు. భవిష్యత్తులో గురుకుల పాఠశాలల్లో నెలకొన్న వివిధ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ముఖ్యంగా విద్యార్థులకు ట్రంకు పెట్టెలు, బెడ్‌షీట్లు, కాస్మొటిక్ ఛార్జీల వంటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొర్రపాడు గురుకుల పాఠశాలల పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ బంగి ఓబుళపతి, ఎస్సీ, ఎస్టీ ఫోరం సంఘం రాష్ట్ర అధ్యక్షులు నెరమెట్ల యల్లన్న, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు జి.వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్.భాస్కర్, సిఐటియు మండల కార్యదర్శి సి.నాగేంద్ర, నెట్టికంటయ్య, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
మజ్జిగ పంపిణీలో పాల్గొన్న కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప, నాయకులు










