Jul 13,2022 22:51

ప్రభుత్వ ఆమోదం కోసం
'చిత్తూరు నగర మాస్టర్‌ ప్లాన్‌'
పట్టణాభివృద్ధి సంస్థ మొదటి అథారిటీ సమావేశం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
చిత్తూరు పట్టణాభివృద్ధి సంస్థ (చుడా) అథారిటీ మొదటి సమావేశం చైర్మన్‌ పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన బుధవారం చుడా కార్యాలయంలో జరిగింది. చిత్తూరు నగర అభివృద్ధి కోసం ఇటీవల ప్రకటించిన 'మాస్టర్‌ ప్లాన్‌- 2041' అభ్యంతరాలు, సలహాలపై అథారిటీ సమావేశంలో సభ్యులు చర్చించి ప్రభుత్వ ఆమోదం కోసం నివేదించారు. చిత్తూరు అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, మెంబర్‌ కన్వీనర్‌, వైస్‌చైర్మన్‌ పి.విశ్వనాథ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి సభ్యుల హోదాలో జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ వీడియో సమావేశం ద్వారా హాజరయ్యారు. ఎంఏయుడీ ప్రత్యేక కార్యదర్శి స్థానంలో ఓఎస్డీ, ఆర్‌అండ్‌ బి ఎస్‌ఈ, ఏపీ ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ, టూరిజం మేనేజర్‌, ఇండిస్టియల్‌ జేడీ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈలు హాజరయ్యారు. ఈసమావేశంలో భాగంగా మాస్టర్‌ ప్లాన్‌- 2041పై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులు, డీటీసీపీ ద్వారా చేపట్టిన చర్యలపై చర్చించారు. అనంతరం మాస్టర్‌ప్లాన్‌ ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేధించారు. చిత్తూరు పట్టణాభివద్ధి సంస్థకు అదనపు నిధులు కేటాయించాలని, రూరల్‌ ప్రాంతాలకు మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేసేందుకు అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి నివేదించారు. సమావేశంలో పట్టణ ప్రణాళిక రీజినల్‌ డైరెక్టర్‌ దేవీకుమారి, కార్యదర్శి మధు, ఈఈ తులసీరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.