సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు పిలుపు
ప్రజాశక్తి- తిరుపతి టౌన్:
సోమవారం స్థానిక యశోదానగర్‌లోని ఎంబి భవన్‌లో సిపిఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య అధ్యక్షత వహించగా శ్రీనివాసరావు మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి నిధులు పూర్తిగా తగ్గించేసిందని, అదే మాదిగా వైసిపి ప్రభుత్వం కూడా ప్రజలపై తీవ్రమైన భారాలు మోపుతోందని అన్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో బిజెపి వంటి మతోన్మాద పార్టీలు గెలవడం దేశానికి ప్రమాదకరమని అన్నారు. నేడు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు నిధుల కొరత తీవ్రంగా ఉందని అన్నారు. పేదలు కనీసం ఇళ్లు కట్టుకోలేని స్థితి ఏర్పడిందని, పెరిగిన సిమెంట్, స్టీల్, ఇసుక ధరలతో పేదవాడి సొంతింటి కల కలగానే మిగిలిందని అన్నారు. మరో పైపు ఆస్తి, చెత్త పన్నులు పట్టణాల్లో విపరీతంగా పెరిగాయని, ఫలితంగా పేద,మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థికభారం పడుతోందని అన్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుతో ఆ భారాన్ని కూడా ప్రజలపై వేయడానికి పూనుకుందని, జెన్‌కో ట్రాన్స్‌కో పూర్తిస్థాయిలో ప్రైవేటు పరం చేసేసి పార్లమెంట్‌లో చట్టం చేయాలని ప్రయత్నిస్తోందని అన్నారు. దీనికి టిడిపి, వైసిపి ఎంపిలు మద్దతు ఇవ్వకుండా ఉండాలని ఆయన కోరారు. ప్రజావ్యతిరేక విధానలపై రాబోయే కాలంలో పెద్దఎత్తున ఉద్యమాలు తీవ్రతరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వి.నాగరాజు, నాయకులు జనార్థన్, సుబ్రహ్మణ్యం, జయచంద్ర, సాయిలక్ష్మీ, హేమలత, వేణు, ఆర్.వెంకటేష్, చిరంజీవమ్మ, తదితరలు పాల్గొన్నారు.










