ఆర్‌డిఒ, సిఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ క్రైస్తవ సంఘాల నాయకుల ర్యాలీ, మానవహారం
ప్రజాశక్తి - ఉండి
నిర్మాణంలో ఉన్న ప్రార్థన మందిరాన్ని అక్రమంగా కూల్చివేసినవారిపై చర్యలు తీసుకోవాలని క్రైస్తవ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శనివారం ర్యాలీ, రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. మండలంలోని చెరుకువాడలో ప్రార్ధన మందిరాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారని గ్రామపంచాయతీ కార్యదర్శి కేశిరెడ్డి గోపాలకృష్ణ ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు శుక్రవారం రాత్రి జెసిబి సాయంతో కూల్చివేశారు. దీంతో శనివారం క్రైస్తవ సంఘాల నాయకులు ఉండి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉన్న పార్క్ వద్ద నుంచి మెయిన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి సెంటర్లో రాస్తారోకో, మానవహారం చేశారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఎఫ్‌ఐసి జాతీయ అధ్యక్షులు పీటర్ పుట్ట, రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఇస్మాయిల్, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నాయకులు మత్తే రాజ్‌కుమార్ మాట్లాడుతూ చెరుకువాడ నూతిగట్టు ప్రాంతంలో 13 సంవత్సరాలుగా తాటాకింట్లో ప్రార్థనా మందిరం నిర్వహిస్తుండగా దాని స్థానంలో గత రెండేళ్ల క్రితం చర్చి ఫాస్టర్ హేమకుమార్ నూతనంగా ప్రార్థన మందిరం నిర్మాణానికి పూనుకున్నామన్నారు. స్థానికుల అవరోధాలను ఎదుర్కొని ఇటీవల క్రైస్తవ సంఘాల నాయకుల మద్దతుతో భవన నిర్మాణ పనులు వేగవంతం చేయగా శుక్రవారం రాత్రి అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం అత్యంత దారుణమన్నారు. ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు దళితుల ఓట్ల కోసం అభ్యర్థిస్తారని, కానీ తమకు ఇబ్బందులు ఏర్పడిన తరుణంలో ఏ ఒక్క ప్రజా ప్రతినిధి కూడా తమ బాధను తీర్చలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం 20 బస్సులతో చలో అమరావతి కార్యక్రమానికి దళిత నాయకులు పిలుపునిచ్చారు. అధికారులు వచ్చి సమాధానం ఇచ్చేవరకు ఉద్యమం ఆగదని వారు హెచ్చరించారు. ఈ సంఘటనకు బాధ్యులైన భీమవరం రెవెన్యూ డివిజనల్ అధికారి దాసిరాజు, ఆకివీడు రూరల్ సిఐ గీతా రామకృష్ణలను విధుల నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆర్‌డిఒ, సిఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ పి.ప్రశాంతికి ఫిర్యాదు చేయడానికి ఉండి మెయిన్ సెంటర్ నుంచి భీమవరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎఫ్‌సిఐ జిల్లా ప్రెసిడెంట్ స్టాన్లీ థామస్, వెల్ఫేర్ ప్రెసిడెంట్ ఐజక్ పాల్, ఉండి పాస్టర్స్ ప్రెసిడెంట్ డేవిడ్‌రాజు, జోసఫ్ రాజు, కాళ్ల ప్రెసిడెంట్ సుందర్రావు, పురుషోత్తం, జిల్లా సెక్రటరీ చిరంజీవి, సువార్త రాజు, ఎఐసియు నాయకులు రాజారావు, దళిత నాయకులు పాల్గొన్నారు.










