May 07,2023 21:15

రాయదుర్గంలోని ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం వద్ద నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు, కార్యకర్తలు

           ప్రజాశక్తి-రాయదుర్గం  రాయదుర్గం సర్వజన ప్రాంతీయ ఆసుపత్రిలో ఆఫీస్‌ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న వరప్రసాద్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.మల్లికార్జున డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆదివారం స్థానిక ఆసుపత్రి ముందు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపరింటెండెంట్‌ వరప్రసాద్‌ ఆసుపత్రిలో హిట్లర్‌లా వ్యవహరిస్తున్నాడన్నారు. ఆసుపత్రి తన సొంత ఇంటిగా మార్చుకుని ఆసుపత్రిలో చేయలేని పనులను చేయిస్తున్నాడని వాపోయారు. ముఖ్యంగా మహిళా వైద్యులు, కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా దుర్భాషలాడుతున్నాడన్నారు. ఆయన మాట వినకపోతే కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నాడని మండిపడ్డారు. రాత్రి వేళల్లో ఈ అధికారికి కార్మికులు దగ్గరుండి సఫర్యాలు చేయాల్సి వస్తోందన్నారు. చేయకపోతే కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడన్నారు. ఈయన తీరుతో కార్మికులు మనోవేదనకు గురై తమ బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక కుంగిపోతున్నారన్నారు. అనంతరం డాక్టర్‌ మాధవిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇందుకు డాక్టర్‌ స్పందిస్తూ సమస్యలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దృష్టి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే జిల్లా వైద్యాధికారులు స్పందించి సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు మధు, శంకర్‌, తిమ్మరాజు, కృష్ణానాయక్‌, నాగేంద్రనాయక్‌, తిప్పేస్వామి, అంజి, నాగేంద్ర, మహేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బంగి శివ, కేశవ, మల్లికార్జున, బొమ్మన, ఉమేష్‌, తదితరులు పాల్గొన్నారు.