అనంతపురం : టిడిపి అధికారంలో ఉన్నన్ని రోజులూ చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పేరుతో నీళ్లు కాకుండా నిధులు పారించారని వైసిపి ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాడు అనంతపురం జిల్లా వైసిపి కార్యాలయలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఉమ్మడి అనంతపురం జిల్లా వైసిపి ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, శంకరనారాయణ, డా||సిద్ధారెడ్డి, తిప్పేస్వామి, ఎమ్మెల్సీ మంగమ్మ, జిల్లా పరిషత్ ఛైర్మన్ బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి పూర్తి చేసినట్లు చెప్పుకునే ప్రాజెక్ట్ ఒక్కటీ లేదన్నారు. రామారావు 40 టిఎంసిలతో హంద్రీనీవా ప్రాజెక్టుకు డిపిఆర్ సిద్ధం చేసినా, చంద్రబాబు దానిని 1998లో తాగునీటి ప్రాజెక్టుగా మార్పు చేశారన్నారు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి 60 వేల కోట్లు ఖర్చు చేసి దాదాపు 63 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. అందులో 23 ప్రాజెక్టులు పూర్తి చేశారని తెలిపారు. తక్కిన ప్రాజెక్టులు 60 నుంచి 80 శాతం వరకు పనులు పూర్తి చేయించారని చెప్పారు. అనంతపురం జిల్లాలో జీడిపల్లి రిజర్వాయర్ వరకు హంద్రీనీవా మొదటిదశ పనులు పూర్తి చేయించి కష్ణా జలాలు తీసుకొచ్చారన్నారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో 60 వేల కోట్లు ఖర్చు చేసి 70 శాతం పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులకు సంబంధించి 30 శాతం పనుల్లో 15 శాతం పనుల కోసం చంద్రబాబు 60 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇలా చంద్రబబు ప్రాజెక్టుల పేరుతో నిధులను దుర్వినియోగం చేశారు తప్పా నీళ్లను తెప్పించి లేదన్నారు. ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు నయాపైసా కూడా పరిహారం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారన్నారు. అలాంటి వ్యక్తి ప్రాజెక్టుల పేరుతో ఇప్పుడు సందర్శనకు రావడం సిగ్గుచేటన్నారు. రైతులందరూ చంద్రబాబు పర్యటను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ విశ్వేశ్వరరెడ్డి, వైసిపి జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, ఎడిసిసి బ్యాంకు ఛైర్మన్ లిఖిత, హిందూపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దీపిక, పాల్గొన్నారు.










