Aug 01,2023 22:30

విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి

         అనంతపురం : అధికారంలో ఉన్నన్ని రోజులూ టిడిపి ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో ధన దోపిడీ చేసిందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నాడు అనంతపురంలోని ఆర్‌అండ్‌బి అతిథిగహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉందంటే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత హంద్రీనీవాను 40 టిఎంసిల సాగునీటి ప్రాజెక్ట్‌గా మార్చి మొదటివిడతగా జీడిపల్లి రిజర్వాయర్‌ వరకు పనులు పూర్తి చేశారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్‌ పార్టీ హయాంలో 2012లో జీడిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు వచ్చాయన్నారు. అప్పట్లో పేరూరు జలసాధన సమితి పేరుతో పేరూరు డ్యాంకు హంద్రీనీవా నీటిని ఇవ్వాలని తాను ఉద్యమాన్ని తీసుకొచ్చానని గుర్తు చేశారు. కేవలం 10 కోట్ల రూపాయల ఖర్చుతో పేరూరు డ్యాంకు హంద్రీనీవా నీళ్లు ఇవ్వొచ్చని టిడిపి అధికారంలో ఉండగా తాను అనేకమార్లు చెప్పాన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దష్టికి విలేకరులు కూడా తీసుకెళ్లారన్నారు. అయితే దీని గురించి పట్టించుకోలేదన్నారు. వైసిపి అధికారంలోకి రాగానే పేరూరు డ్యాంకు ఒక టిఎంసి నీటిని కేటాయిస్తూ జీవో తెచ్చామన్నారు. దాతలు, రైతుల సహకారంతో పెన్నానదిలో 40 కిలోమీటర్ల కాలవ తవ్వించి పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం టిడిపి చేసింది శూన్యం అన్నారు. అలాంటి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ప్రాజెక్టుల పరిశీలన చేసే అర్హత లేదన్నారు.