అనంతపురం ప్రతినిధి : వైసిపి నాలుగేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టు పనులు చేసిందాని కంటే రద్దయినవే ఎక్కువ. అతి ముఖ్యమైన పనులు కూడా రద్దవడంతో సాగునీరు ముందుకు సాగడం గగనంగా మారుతోంది. జిల్లాకు అత్యంత ప్రధానమైన తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ మొదలుకుని అనేక పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దీంతో నీటి నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. తుంగభద్ర కాలువకు ఎప్పుడు ఎక్కడ గండ్లు పడుతాయోనని భయంభయంగానే అధికారులు పనులు కానిస్తున్నారు.
తుంగభద్ర ప్రధాన కాలువ ఆధునీకరణ రద్దు...
తుంగభద్ర డ్యామ్ నుంచి అనంతపురం జిల్లాకు సాగు, తాగునీటిని అందించే ప్రధాన కాలువ తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ 105 కిలోమీటర్లు కర్నాటకలో పూర్తి చేసుకుని బొమ్మనహల్ మండలంలో జిల్లాకు ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 84.54 కిలోమీటర్లు జిల్లాలో ఉంటుంది. ఈ కాలువ ప్రస్తుతం 2600 క్యూసెక్కులు ప్రవాహ సామర్థ్యముంది. దీన్ని 4200 క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయించడంతోపాటు కాలువను ఆధునీకరించాలని నిర్ణయించి 2007వ సంవత్సరంలో రూ.458.42 కోట్లతో పనులు చేపట్టారు. క్రాప్ హాలిడే ఏదీ లేకుండా సీజన్ లేని సమయాల్లో అంటే కాలువలో నీరు ప్రవహించినప్పుడు పనులు చేపట్టాలని నిర్ణయింంచారు. నాలుగు సంవత్సరాల్లో ఈపనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం. కాని సకాలంలో పూర్తి కాకుండా ఏటా లక్ష్యాన్ని పెంచుకుంటూపోయారు. 2019 వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీన్ని పూర్తిగా రద్దు చేసింది. అప్పటి వరకు 309.78 కోట్లు ఖర్చు చేసింది. తక్కిన పనులన్నింటినీ రద్దు చేయడమే కాకుండా తిరిగి ఐదు సంవత్సరాలు పని చేయడానికి వీల్లేదన్న నిబంధన కూడా అందులో పెట్టింది. దీంతో తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. గట్లు బలహీనపడి ఉండటంతో ఎప్పుడు ఎక్కడ గండిపడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
హంద్రీనీవాలో తొమ్మిది పనులు
ఇదే తరహలో హంద్రీనీవా పనుల్లోనూ ప్రభుత్వం తొమ్మిది పనులను రద్దు చేసింది. మొదటి విడతలో తొమ్మిది పనులు, రెండో విడతలో 19 పనులు కలిపి మొత్తం 28 పనులు నడుస్తున్నాయి. వీటి విలువ రూ.3374 కోట్లు. అయితే ఇందులో రూ.1231 కోట్ల పనులు జరిగాయి. తక్కిన 2154 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనుల్లో తొమ్మిది పనులను ప్రభుత్వం ప్రీక్లోజర్ చేసింది. మొదటి విడతలో ఆరు, రెండో విడతలో తొమ్మిది పనులు ప్రీ క్లోజ్ చేసింది.
మిడ్‌పెన్నార్ దక్షిణ, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ పనులు అమోయమయంలోనే.?
ఇక మిడ్‌పెన్నార్ దక్షిణ కాలువ పనుల పరిస్థితి అదే తీరున ఉంది. మిడ్‌పెన్నార్ డ్యామ నుంచి ఈ కాలువ పొడవు కూడా 84 కిలోమీటర్లు ఉంది. ఈ కాలువ ఆధునీకరణ కూడా రూ.509.158 కోట్లతో చేపట్టారు. ఇందులో రూ.158.13 కోట్ల పని జరిగింది. తక్కన పని జరగలేదు. ఇక ఈ పనులు చేయలేమంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ఇక గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ పనులు రూ.234.67 కోట్లతో చేపట్టారు. ఇప్పటి వరకు రూ.176 కోట్ల పనులు చేశారు. ఇక వీరు చేయలేమని చెప్పడంతో పనులు ఆగిపోయాయి. ఇక జిల్లాకు ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టు పనులన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి.










