Jun 14,2023 22:59

వీడియో కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, ఎస్పీ తదితరులు

          అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని మరింత వేగవంతంగా పూర్తి చేసే బాధ్యతను తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి సూచించారు. జగనన్నకు చెబుదాం, గడప గడపకూ మన ప్రభుత్వంతో పాటు జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ది పనులపై ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి బుధవారం నాడు వీడియో కాన్ఫిరెన్స్‌ నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్‌ ఎన్‌ఐసి వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌, జగనన్నకు చెబుదాం కార్యక్రమం జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్‌, ఎస్పీ శ్రీనివాసరావు, జాయింట్‌ కలెక్టర్‌ కేతాన్‌ గార్గ్‌లు పాల్గొన్నారు. వీడియో కాన్ఫిరెన్స్‌లో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అధికారులు తీసుకోవాల్సిన చర్యలు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్‌ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం 1902 ద్వారా వచ్చే ఫిర్యాదులను పారదర్శకంగా ప్రజల్లో సంతప్తికర స్థాయి పెరిగేలా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంపై అలసత్వం వీడాలన్నారు. బాధితుల సమస్యలు పరిష్కరించలేక పోతే ఎందువల్ల పరిష్కరించే లేకపోయామో అర్జీదారునికి స్పష్టంగా తెలపాలన్నారు. కనీసం 5 మంది ఫిర్యాదుదారులతో వ్యక్తిగతంగా ఫోన్‌ ద్వారా సంప్రదించి సమస్యను పరిష్కరించాలని తెలిపారు. వైఎస్సార్‌ హెల్త్‌ క్లీనిక్‌, డిజిటల్‌ లైబ్రరీ పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని అన్ని శాఖ ల అధికారులు తమ శాఖల పరిధిలో జరుగుతున్న కార్యక్రమాలు వంద పూర్తిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. జగనన్న హౌసింగ్‌ కాలనీల నిర్మాణ పనుల్లో పురోగతి సాధించాలన్నారు. రీ సర్వే పనులు వేగవంతం చేయాలన్నారు. కాగ సమావేశానికి ఇరిగేషన్‌ శాఖ అధికారులు గైర్హాజరు అవడంపట్ల కలెక్టర్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు తన అనుమతి లేనిదే జిల్లా కేంద్రాన్ని వదలి వెళ్లరాదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌, సిపిఒ ప్రేమచంద్ర, డిప్యూటీ సీఈవో అమతరాజ్‌, డిపిఒ ప్రభాకర్‌తో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.