అనంతపురం ప్రతినిధి:ఖరీఫ్‌కు పప్పుధాన్యాలు, చిరుధాన్యాల విత్తనాల సబ్సిడీ ధరలు ఖరారయ్యారు. 30 శాతం సబ్సిడీతో విత్తనాల ధరలను ప్రభుత్వం నిర్ణయించింది. మినుములు కిలో అమ్మకం ధర రూ.117.50 కాగా, 30 శాతం సబ్సిడీ అంటే కిలోపై రూ.35.25 ఇవ్వనున్నారు. రైతు కిలోకు రూ.82.25 చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు కిలోల చొప్పున ఒక్కో ప్యాకెట్ ఉంటుంది. అర ఎకరానికి ఒక ప్యాకెట్ చొప్పున గరిష్టంగా ఐదు ఎకరాలకు పది ప్యాకెట్లు సబ్సిడీతో ఇవ్వనున్నారు. పియు-31, ఎల్‌బిజి-752, ఐపియు 2-43, టిబిజి-104 రకాలు పంపిణీ చేయనున్నారు. పెసలు ఐపిఎం2, -14, ఇతర రకాలు కిలో ధర రూ.117.50 సబ్సిడీ రూ.35.25 సబ్సిడీ ఇవ్వనున్నారు. రైతు రూ.82.25 కిలో చొప్పున ఇవ్వనున్నారు. కందులు ఎల్‌ఆర్‌జి-52, ఐసిపిఎల్-87119 కిలో రూ.111.14 చొప్పున సబ్సిడీ రూ.33.42 ఇవ్వనున్నారు. రైతు వాటాగా రూ.77.89 కిలోకు చెల్లించాలి. ఐసిపిహెచ్-2740 పూర్తి ధర రూ.128 కిలో పూర్తి ధరకాగా రూ.38.40 సబ్సిడీ ఇవ్వనున్నారు. రూ.89.60 కిలోకు రైతు వాటాగా చెల్లించాలి. నాలుగు కిలోలు, రెండు కిలోల ప్యాకెట్లు అర ఎకరానికి ఒకటి, ఐదు ఎకరాలకు అవుతే పది ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు.
50 శాతం సబ్సిడీతో చిరు ధాన్యాలు
చిరుధాన్యాలకు సబ్సిడీని కొంత పెంచారు. 50 శాతం సబ్సిడీతో చిరుధాన్యాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొర్ర ఎస్‌ఐఎ-3156 రకం పూర్తి ధర కిలోకు రూ.67.50 కాగా 50 శాతం సబ్సిడీతో అంటే సబ్సిడీ రూ.33.75 కాగా రైతు వాటా ధర రూ.33.75. ఇక రాగికి ఇంద్రావతి రకం ఇవ్వనున్నారు. దీనికి కూడా 50 శాతం సబ్సిడీతో ఇవ్వనున్నారు. దీని ధర కూడా కిలో రూ.69.50 కాగా, సబ్సిడీ రూ.34.75 కాగా ,రైతు తన వాటాగా రూ.34.75 చెల్లించాల్సి ఉంది. ఇవి రెండు కిలోల ప్యాకెట్లను ఒకటి నుంచి ఐదు వరకు ఇవ్వనున్నారు. వీటితోపాటు సాములు, అరికెలు, ఊదలు, అండుకొర్ర తదితర చిరు ధాన్యాలను పంపిణీ చేయనున్నారు. వీటి కేటాయింపులు కూడా ఇది వరకే జరిగి ఉన్నాయి. వీటితోపాటు వరి ధాన్యం కూడా పంపిణీ చేయనున్నారు. వరిధాన్యం అర ఎకరానికి అయితే 25 కిలోలు, 30 కిలోల ప్యాకెట్ అర ఎకరానికి ఒకటి, ఐదు ఎకరాలకు గరిష్టంగా నాలుగు ప్యాకెట్లు అందజేయనున్నారు. ఈ విత్తన పంపిణీకి అధికారులు వేరుశనగతోపాటే ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ తరువాతే పంపిణీ
రైతు భరోసా కేంద్రాల్లో వీటిని కూడా రిజిస్ట్రేషన్‌ను ముందుగానే రైతులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే వేరుశనగ పంటకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇక పప్పుధాన్యాలు, చిరుధాన్యాలకు సంబంధించి కూడా అదే పద్ధతుల్లో సాగు విస్తీర్ణం బట్టి రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు తమవాటా డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత రైతు భరోసా కేంద్రాలు ద్వారా ఆయా గ్రామాల పరిధిలోనే పంపిణీ చేయనున్నారు.










