Mar 16,2023 21:03

ప్రజాశక్తి - భీమవరం
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి పొట్టి శ్రీరాములు అమరజీవిగా మనందరి మదిలో చిరస్థాయిగా మిగిలారని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు. గురువారం పొట్టి శ్రీరాములు జయంతి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములు చిత్రపటానికి కలెక్టర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేషకృషి చేసిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. ఇన్‌ఛార్జి జెసి ఎం.సూర్య తేజ మాట్లాడుతూ తెలుగు ప్రాంత అభివృద్ధి కోసం, ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి రాష్ట్ర సాధనకు కృషి చేసిన వ్యక్తి అన్నారు. ఈ సందర్భంగా 133 మంది సాంఘిక సంక్షేమ శాఖ, బిసి సంక్షేమ శాఖ పదవ తరగతి విద్యార్థులకు జియో కిమ్‌ వారు అందజేసిన ఆల్‌ ఇన్‌ వన్‌ గైడ్స్‌ పుస్తకాలను కలెక్టరు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణవేణి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి గణపతిరావు, ఆర్‌డిఒ దాసి రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.భీమవరం ఆర్‌డిఒ దాసి రాజు సతీమణి ఎల్‌జి సౌజన్య ఆర్థిక సహకారంతో తండ్రి లింగం జోషి పేరున కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి ఆవిష్కరించారు.
భీమవరం రూరల్‌ :భాషా ప్రయోక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని జిల్లా అడిషనల్‌ ఎస్‌పి ఎవి సుబ్బరాజు కొనియాడారు. పొట్టి శ్రీరాములు జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్‌ ఎస్‌పి సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారన్నారు. పొట్టి శ్రీరాములు మరణానంతరం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి ఎఆర్‌ డిఎస్‌ఫి ఎం.సత్యనారాయణ, ఆర్‌ఆర్‌ఐ శ్రీకాంత్‌, డిపిఒ ఎఒ రామ్మోహన్‌ తదితరులు నివాళులర్పించారు.
అత్తిలి : ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములని ఎంపిడిఒ వివివిఎస్‌.రామారావు కొనియాడారు. ఎంపిడిఒ కార్యాలయంలో గురువారం పొట్టి శ్రీరాములు జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడారు. కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి ఎం.శ్రీనివాసరావు, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ సిబ్బంది, మండల పరిషత్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పెనుమంట్ర : మార్టేరు వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్‌ఛార్జి ఎడిఆర్‌ ఎం.చారుమతి, ప్రధాన శాస్త్రవేత్త కెఎం.దక్షిణామూర్తి, మరో శాస్త్రవేత్త బి.అనూష ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
పోడూరు : విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండే పోటీతత్వం అలవర్చుకోవాలని కనకదుర్గ, వాసవి స్వచ్ఛంద సేవాసంస్థ ఛైౖర్మన్‌ బేతాలం సూర్యనారాయణ పిలుపునిచ్చారు. పోడూరు శివారు కొత్తపేట ప్రాథమిక పాఠశాలలో సంస్థ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతిని నిర్వహించారు. ముందుగా శ్రీరాములు చిత్రపటానికి సంస్థ ఛైర్మన్‌ సూర్యనారాయణ, పాఠశాల హెచ్‌ఎం కేతా నాగరాజు, పిఎంసి ఛైర్మన్‌ చిట్టూరి నరసింహారావు నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలో 34 మంది విద్యార్ధులకు సంస్థ తరుపున భోజనం ప్లేట్లు అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో పిఎంసి వైస్‌ ఛైర్మన్‌ కత్తుల సుధ, వాసా దుర్గారావు, వై.శ్రీను పాల్గొన్నారు.
మొగల్తూరు : అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని విగ్రహ దాతలు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయ సమీపంలోని శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి పడవల మేరి సత్యనారాయణ, పువ్వాడ శేషగిరి, రాజా, పొత్తూరి శివ పాల్గొన్నారు. వాసవీ, వనిత క్లబ్‌ సభ్యులు శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. అలాగే ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస మార్గాల్లో నడిచిన మహా పురుషుడు పొట్టి శ్రీరాములు అన్నారు. అనంతరం మొగల్తూరులోని ఆర్యవైశ్య కళ్యాణమండపం, గాంధీ బొమ్మ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలవేసి సంఘ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఆయా కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ గ్రామ అధ్యక్షులు ఎస్‌ఎంఆర్‌ నాగేశ్వరరావు, యూత్‌ అధ్యక్షులు సంక గుప్తా, కార్యదర్శి, సీమకుర్తి బాలాజీ పాల్గొన్నారు.
పాలకొల్లు : స్థానిక జివిఎస్‌వి ఆర్‌ఎం మున్సిపల్‌ పాఠశాలలో జెసిఐ పాలకొల్లు రైజింగ్‌ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మౌని కావలి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే దేశభక్తిని గుండెల్లో నింపుకున్న వ్యక్తి శ్రీరాములు అన్నారు. ఈ కార్యక్రమంలో కారుమూరి సబిత, రేపాక మీనా మణి, హెచ్‌ఎం రాయపూడి భవాని ప్రసాద్‌ పాల్గొన్నారు.