
* ముఖం చాటేసిన వరుణుడు
* ఎండిపోతున్న వరి పంట
* అప్పుల ఊబిలో అన్నదాత
ప్రజాశక్తి - కవిటి: తీవ్ర వర్షాభావ పరిస్థితులు, సాగునీరందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతను నిలువునా ముంచేశాయి. చినుకు రాలక చేను ఎండిపోతూ అన్నదాతలకు పొట్ట దశలో పుట్టెడు శోకం మిగులుస్తోంది. కరువు పరిస్థితుల నేపథ్యంలో కవిటి మండలంలోని కొజ్జిరియా, బెలగాం, శిలగాం, కరాపాడు, రఘునాథపురం, భైరిపురం, రాజపురం తదితర పంచాయతీల్లో 500 ఎకరాలకు పైగా పంటకు నష్టం వాటిల్లింది. దీంతో చేసిన అప్పు తీర్చలేక, ఆదాయం వచ్చే మార్గమే లేక అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు.
కవిటి మండలం భైరిపురానికి చెందిన పుల్లట ప్రసాదరావు ఐదెకరాల్లో వరి నాట్లు వేశారు. ఇందుకోసం అన్ని ఖర్చులు కలుపుకొని రూ.1.18 లక్షలు ఖర్చు చేశారు. నెల రోజులుగా చినుకు రాలకపోవడంతో నాట్లు ఎండిపోయాయి. దీంతో సేద్యం కోసం చేసిన అప్పు ఇప్పుడు ఎలా తీర్చాలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కొజ్జిరియా పంచాయతీకి చెందిన ఉప్పాడ గిరి కొజ్జిరియా, రఘునాథపురం రెవెన్యూ పరిధిలో ఐదెకరాల్లో వరి నాట్లు వేశాడు. ఇందుకోసం రూ.లక్ష ఖర్చు చేసినా నాట్లు ఎండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. కొజ్జిరియాకు చెందిన మరో రైతు సరస్వతి కరాపాడులో రెండు ఎకరాలు, కొజ్జిరియాలో ఎకరాలో వరి నాట్లు వేసింది. ఇప్పటివరకు సుమారు రూ.50 వేలు ఖర్చు చేసిన ఆమె చేను ఎండిపోవడంతో ఉసూరంటోంది. పై పంచాయతీల్లో మిగతా రైతులది ఇదే పరిస్థితి.
చేను ఎండిపోయింది
రెండెకరాల్లో వరి సాగు చేశాను. రూ.30 వేలకు పైగా ఖర్చు చేశాను. వర్షాధార భూములు కావడంతో అడపాదడపా వచ్చిన చినుకులు, స్థానికంగా ఉన్న గుమ్ములు ఉపయోగించుకుని పంట పొట్ట దశ వరకు వచ్చాను. ప్రస్తుతం చేయి దాటిపోయింది. చేను ఎండిపోయింది. ఇప్పుడు దృష్టంతా పంట కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలనే దానిపైనే ఉంది.
- పనపాన ఉమాపతి, రైతు, కొజ్జిరియా
పంట పోయింది... అప్పు మిగిలింది
ఆరుగాలం శ్రమించి పండించిన పంట పోయింది. దాని కోసం చేసిన అప్పు మాత్రం మిగిలింది. నేను 1.50 ఎకరాల్లో వరి వేశాను. ఇప్పటికి రూ.25 వేలు ఖర్చు చేశాను. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ప్రస్తుతం పంట పొట్ట దశలో ఎండిపోతోంది. పంట కోసం చేసిన అప్పు కుంపటిలా మారుతోంది.
- ఉప్పాడ పకీర్ రెడ్డి, రైతు, భైరిపురం