
* మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
* రాత్రి 8 గంటలకు గరిష్టంగా 71 వేల క్యూసెక్కుల ప్రవాహం
* కొత్తూరు మండలంలో పలు గ్రామాల్లోకి వరద నీరు
క్రమేణా తగ్గుముఖం
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి, కొత్తూరు, జలుమూరు : ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు వంశధార పోటెత్తింది. ఉదయం ఆరు గంటల నుంచి క్రమేణా నీటి ప్రవాహం పెరిగి ఉదయం 11 గంటల ప్రాంతంలో 25 వేల క్యూసెక్కులకు చేరింది. 11.30 గంటలకు ఒక్కసారిగా 40 వేల క్యూసెక్కులు దాటిపోవడంతో అధికారులు ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద ప్రవాహం ప్రవాహం పెరుగుతుండడంతో వంశధార ప్రాజెక్టు సర్కిల్ ఇఇ డి.ఎస్ ప్రదీప్ హిరమండలం గొట్టాబ్యారేజీ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఒడిశా అధికారులతో మాట్లాడారు. సాయంత్రం ఆరు గంటల సమయానికి నదిలో ఇన్‌ఫ్లో 73,770 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 68,882 క్యూసెక్కులుగా ఉంది. అక్కడి నుంచి క్రమేణా వరద తగ్గుముఖం పట్టింది. రాత్రి ఎనిమిది గంటలకు ఇన్‌ఫ్లో 71,690 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 70,217 క్యూసెక్కులుగా ఉంది.
వంశధారకు వరద పోటెత్తడంతో కొత్తూరు మండలంలని నదీ పరివాహక గ్రామాలైన పెనుగోటివాడ, మాతల, నివగాం, సోమరాజపురం, మదనాపురం, ఆకులతంపరలో పొలాలు ముంపునకు గురయ్యాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పొలాలకు వరద పోటెత్తడంతో సుమారు 500 ఎకరాలు వరి , అరటి, చెరకు పంట ముంపునకు గురైందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేయకపోవడంతో ఎక్కువ నష్టం వాటిల్లిందని చెప్తున్నారు. జలుమూరు మండలంలోని నదీ పరివాహక ప్రాంతాలైన కొమనాపల్లి, సురవరం, అందవరం గ్రామాల్లో తహశీల్దార్ బి.సత్యం పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. వంశధార నదిలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ పి.పారినాయుడు, విఆర్‌ఒలు గోపి, విజయబాబు జాగ్రత్తలు చెప్పారు.
అధికారులు అప్రమత్తం
వంశధార ఉధృతంగా ప్రవహించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, నీటిపారుదల శాఖ, విపత్తుల నివారణ సంస్థ, తదితర శాఖల అధికారులతో కలెక్టర్
శ్రీకేష్ లాఠకర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్తూరు, భామిని, హిరమండలం, ఎల్.ఎన్ పేట, సరుబుజ్జిలి, పోలాకి, ఆమదాలవలస, జలుమూరు, నరసన్నపేట తహశీల్దార్లు వారి పరిధిలోని ముంపు ప్రాంతాల ప్రజలకు చాటింపు వేయించాలని సూచించారు. వరద నేపథ్యంలో కలెక్టరేట్‌లో 08942-240557 ఫోన్ నంబరుతో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా కాశీనగరం నుంచి నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున వంశధార నదిలో నీరు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకు తగ్గట్టు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ డోల తిరుమలరావుతో మాట్లాడుతూ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేయాలన్నారు. అధికారులందరూ వరద ముంపు ప్రాంతాల తాజా పరిస్థితిని తెలుసుకుంటూ 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలను అప్రమత్తం చేయడం, వరద సహాయక చర్యల్లో వాలంటీర్లను వినియోగించుకోవాలని చెప్పారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, ఎస్‌పి జి.ఆర్ రాధిక, డిఆర్‌ఒ గణపతి, ఆర్‌డిఒలు, తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.