Aug 25,2022 22:36

పోటాపోటీగా ప్రతిపక్ష, అధికార పార్టీల ర్యాలీలు
టిడిపి బ్యానర్లు, ప్లెక్సీలను ధ్వంసం చేసిన వైసిపి నేతలు
కుప్పంలో ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు
ప్రజాశక్తి- కుప్పం:
కుప్పం నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా కుప్పం శాసన సభ్యులు, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు 24వ తేదీ సాయంత్రం రామకుప్పంకు చేరుకున్నారు. ఈ పర్యటనను వైస్సారీసీ శ్రేణులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణలతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రబాబు పర్యటనకు కార్యకర్తలు భారీగా తరలిరావాలని సోషల్‌ మీడియాలో పిలువునివ్వడంతో పరిస్థితి తీవ్రతరమైంది. దీంతో పోలీసులు గురువారం కుప్పంలో భారీగా మోహరించారు. అధికారపార్టీ పిలుపు మేరకు స్పందించిన సుమారు 500 మంది కార్యకర్తలు ఎమ్మెల్సీ భరత్‌ ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు సంబంధించి టిడిపి శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లు, ప్లెక్సీలను వైసిపి నేతలు ధ్వంసం చేశారు. అనంతరం బస్టాండ్‌ ఆవరణకు చేరుకుని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఉన్న టిడిపి ఏర్పాటు చేసిన అన్న కాంటీన్‌ను ధ్వంసం చేయడంతోపాటు అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న బిఎంకె. రవిచంద్ర బాబుపై దాడి చేసి గాయపరిచారు. స్థానికులు ఆయన్ను వెంటనే అంబులెన్స్‌ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న టిడిపి శ్రేణులు భారీ ర్యాలీగా ఎంఆర్‌రెడ్డి సర్కిల్‌ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ముందస్తు జాగ్రత్తతో వారిని అడ్డుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కుప్పం నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రశాంతకు నెలవుగా పేరు తెచ్చుకున్న నియోజకవర్గం. అయితే నేడు ఇక్కడ ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడం శోచనియమని, రాజకీయాలకు అతీతంగా సోదరాభావంతో మెలిగే సంస్కతిని అలవర్చుకోవాలని పలువురు కోరుతున్నారు.