
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: పోస్టల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ అఖిల భారత తపాలా ఉద్యోగ సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త నిరసనల్లో భాగంగా శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ అధికారి కార్యాలయం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. డివిజనల్ అధికారులకు సమస్యలతో కూడిన వినతిపత్రాలను పోస్టల్ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు అందజేశారు. ఈ సందర్భంగా పోస్టుమెన్ యూనియన్ జిల్లా కార్యదర్శి బాబూరావు మాట్లాడుతూ ఉత్తరాల బట్వాడా సమాచారం పోస్టుమెన్‌లు తమ సొంత మొబైల్ ఫోన్ల ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని వేధించడం, అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయలేని ఉద్యోగులపై కక్షపూరితంగా వేధించడం మానుకోవాలని డిమాండ్ చేశారు. గ్రూప్-సి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి గణపతి మాట్లాడుతూ కాలం చెల్లిన కంప్యూటర్లు, ప్రింటర్లను మార్చకుండా, తగిన నెట్‌వర్క్ సదుపాయాలు కల్పించకుండా రోజువారీ లక్ష్యాలను నిర్దేశించడం తగదన్నారు. లక్ష్యాల పేరుతో నిత్యం ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారని, ఇటువంటి కక్షపూరిత చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ తపాలా ఉద్యోగుల జిల్లా కార్యదర్శి నందికేశ్వరరావు మాట్లాడుతూ చిరుద్యోగులైన జిడిఎస్‌లకు రిటైర్మెంట్ సమయంలోనే వారికి రావాల్సిన బెనిఫిట్స్ అందజేయాలన్నారు. టార్గెట్ల పేరుతో జిడిఎస్ ఉద్యోగులను వేధించడం మానుకోవాలన్నారు. పోస్టల్ పెన్షనర్స్ సంఘం నాయకులు చంద్రశేఖర్ సంఘీబావం తెలిపారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు యు.వి రమణ, పాత్రో వెంకటేష్, చిన్నారావు, బి.ఎస్.ఆర్ మూర్తి, గురన్న ప్రకాశరావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.