
* ఆలిండియా పోస్టల్ ఎంప్లాయీస్ జెఎసి నిరసన
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్, పలాస: పోస్టల్ సేవలను ప్రైవేటీకరించడం తగదని అఖిల భారత తపాలా ఉద్యోగ సంఘాల జెఎసి నాయకులు అన్నారు. జెఎసి పిలుపు మేరకు శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో శ్రీకాకుళంలోని పోస్టల్ ప్రధాన కార్యాలయం, పలాసలో కాశీబుగ్గ పోస్టాఫీసుల వద్ద ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పోస్టుమెన్ యూనియన్ జిల్లా కార్యదర్శి బాబూరావు మాట్లాడుతూ ఉత్తరాల బట్వాడా కోసం నోడల్ డెలివరీ సెంటర్లను, హబ్‌లను ఏర్పాటు చేస్తూ పోస్టల్ సేవలను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచన సరికాదన్నారు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ఉద్యోగులు దేశవ్యాప్తంగా రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్‌ఎఫ్‌పిఇ జిల్లా కన్వీనర్ గణపతి, జిడిఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఎన్.నందికేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా రద్దు చేసిన ఎన్‌ఎఫ్‌పిఇ, ఎఐపిఇయు గ్రూప్‌సి సంఘాల గుర్తింపు వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పలు కేడర్లను విలీనం చేసి పోస్టులను తగ్గించి ఉద్యోగులను ఒత్తిడికి గురిచేయడం సరికాదన్నారు. తక్షణమే తపాలా శాఖలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలన్నారు. జిడిఎస్ ఉద్యోగులకు సైతం ఎనిమిది గంటల పని కల్పించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కమలేష్ చంద్ర కమిటీ ఇచ్చిన ఎసిపి ప్రమోషన్, మెడికల్ ఇన్సూరెన్స్, సభ్యత్వ పరిశీలన ప్రక్రియ వెంటనే అమలు చేయాలని పోస్టల్ అండ్ ఆర్‌ఎంఎస్ పెన్షనర్స్ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాశీబుగ్గ సబ్ పోస్టుమాస్టర్ ఎస్.గురుమూర్తి రమేష్, రాంబాబు, కామేశ్వరరావు, టి.ప్రకాశరావు, బి.తేజేశ్వరరావు, చాందిని పాత్రో తదితరులు పాల్గొన్నారు.