Jul 03,2023 21:50

పోరుయాత్ర కరపత్రాలు విడుదల చేస్తున్న ఐద్వా నాయకురాళ్లు

         ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   సమాజంలో చోటు చేసుకుంటున్న హింసలు నిర్మూలించాలని, మద్యం, మత్తు పద్రాలు నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో చేపడుతున్న హింసపై మహిళల పోరు యాత్ర కపత్రాలను ఐద్వా నాయకులు ఆవిష్కరించారు. సోమవారం జెవివి కార్యాలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న హింస వ్యతిరేకిస్తూ జూలై 28వ తేదీ నుంచి ఆగస్టు 9వ తేదీ వరకూ ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్ర జాతా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశం, రాష్ట్రంలో చిన్న పిల్లలు, మహిళలపై దాడులు, హత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని తెలిపారు. మహిళా రెజ్లర్‌లపైనే లైంగిక దాడులు జరుగుతుంటే సమాజం ఎంత దుర్మార్గంగా తయారైందో తెలుస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వాలు, హింసను అరికట్టే వరకూ మనం ఆందోళనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో నిమిషానికి అగాయిత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. వెలుగులోకి వస్తున్నవి కొన్ని మాత్రమే అన్నారు. పోరు జాతాలో మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకురాలు డాక్టర్‌ ప్రసూన, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్యామల, రాజేశ్వరి ఐద్వా నగర కార్యదర్శి చంద్రిక, నాయకులు జయమ్మ, నిర్మల పాల్గొన్నారు.