
* సిఎంకు ఎమ్మెల్సీ దువ్వాడ వినతి
ప్రజాశక్తి - టెక్కలి రూరల్: మూలపేట పోర్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. అమరావతిలోని అసెంబ్లీ ఆవరణలో గురువారం సిఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. నిర్వాసితులకు కేటాయించిన ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఉప్పునీరు పడుతోందని, తాగునీటికి ప్రత్యామ్నాయం చూపాలని విజ్ఞప్తి చేశారు. నిర్వాసిత గ్రామాలైన మూలపేట, విష్ణుచక్రంలో పలు కారణాలతో నేటికీ 18 మందికి పిడిఎఫ్ ప్యాకేజీ అందలేదని సిఎం దృష్టికి తీసుకెళ్లారు. యువతకు స్పెషల్ పిడిఎఫ్ ప్యాకేజ్ రూ.ఐదు లక్షల వరకు ఇప్పించాలని విన్నవించారు. ఈ ప్యాకేజీని పోర్టు శంకుస్థాపన చేసిన తేదీ నుంచి గానీ భూసేకరణకు అంగీకరించిన తేదీ నుంచి గానీ ఇవ్వాలని కోరారు. పోర్టు నిర్మాణం అయ్యాక ప్రతి కుటుంబానికి శాశ్వత ఉద్యోగం ఇస్తామని హామీతో పాటు ఉద్యోగావకాశం కోసం ఎంప్లాయిమెంట్-ఆర్ నంబర్ కలిగిన కార్డును ఇప్పించాలన్నారు. గ్రామకంఠం భూములకు సర్వే చేయించి, అనుభవంలో ఉన్న నిర్వాహితులకు ఆర్ అండ్ ఆర్ నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్సీ తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఆర్ అండ్ ఆర్ కమిటీ సభ్యులు జీరు శివరెడ్డి, కోత దాలయ్య, దారపు అప్పలరెడ్డి, జీరు శ్యామసుందరరావు ఉన్నారు.