
* వీటితో సూక్ష్మపోషకాలు లభ్యం
* సమర్థవంతంగా ఇంటింటికీ సరుకుల పంపిణీ
* జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటరమణ
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: తల్లి గర్భం నుంచి సంపూర్ణ ఆరోగ్యానికి పూనాది వేసేందుకు ప్రభుత్వం పోషకాహారం గల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తోందని జిల్లా పౌర సరఫరాల అధికారి డి.వి.రమణ తెలిపారు. ఈ బియ్యంపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు. కొందరు వీటిని ప్లాస్టిక్ బియ్యంగా ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ బియ్యంపై అవగాహన లేకపోవడంతో ఇటువంటి ప్రచారం సాగుతోందన్నారు. అపోహలు విడనాడి పోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రతి కుటుంబమూ వినియోగించు కోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థతో పాటు మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాలకు ఈ బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ఈ బియ్యం వినియోగించడం వల్ల సంపూర్ణ పోషకాలు లభ్యమవుతాయని వివరించారు. ప్రతిఒక్కరూ వినియోగించేలా విస్తృతమైన అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ సమర్థవంతంగా పారదర్శకంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. పలు అంశాలను 'ప్రజాశక్తి' ముఖాముఖిలో వెల్లడించారు.
ప్రజాపంపిణీ ఎలా సాగుతోంది?
జిల్లాలో పస్తుతం 6,69,858 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో 6,22,423 కార్డులు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ పరిధిలో ఉండగా, మిగిలిన 43,276 కార్డులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కార్డుల పరిధిలో 18,60,072 యూనిట్లకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 1,14,197 యూనిట్లకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నాం. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కార్డుదారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచైనా బియ్యం తీసుకునేందుకు వీలుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్డుల్లో మాత్రం రాష్ట్ర పరిధిలో ఏ డిపో నుంచైనా తీసుకోవచ్చు. వీటికి తోడు జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి, అంగన్వాఢ కేంద్రాలకు కలుపుకుని ప్రతినెలా 9760 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నాం. అయితే పంపిణీ అవుతున్న బియ్యాన్ని ప్లాస్టిక్ బియ్యంగా కొందరు ప్రచారం చేయడంత్తో ప్రజల్లో అపోహలు వస్తున్నాయి. అపోహలు వీడి ఈ బియ్యాన్ని వినియోగించుకుంటే మంచి పోషక విలువలు అందుతాయి.
కొన్ని కుటుంబాలకు రేషన్ కార్డులు నిలిపి వేశారు. వాటిని ఎప్పుడు పునరుద్ధరిస్తారు?
రేషన్ కార్డులు అర్హులైన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం మంజూరు చేస్తోంది. అయితే ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉన్నవారికి మాత్రమే రేషన్ కార్డు కలిగి ఉంటారు. విద్యుత్ బిల్లులు, ఆర్థికంగా ఉన్న వారు, ప్రభుత్వ ఉద్యోగులు, మూడు ఎకరాలకు పైగా భూములున్న వారికి ప్రభుత్వ నిబంధనల కారణంగా రేషన్ కార్డులు నిలిచిపోయాయి. నిబంధనలకు లోబడి కార్డు పొందడానికి వారు అనర్హులని డాక్యుమెంట్ల ప్రాప్తికి గుర్తించిన తర్వాతే కార్డులు తొలగించాం. ప్రభుత్వ డాష్‌బోర్డులో ప్రస్తుతం అర్హతలు కలిగి ఉన్న వారి కార్డు వివరాలు పొందు పరిచాం. ఎక్కడైనా అర్హులై ఉండి రేషన్ కార్డు పొందలేకపోతే సచివాలయంతమ అర్హతలను రుజువు చేసే పత్రాలు సమర్పించి 90 రోజుల్లో కార్డు పొందడానికి ప్రభుత్వం వీలు కల్పించింది.
ప్రస్తుతం జిల్లాలో ఎన్ని రేషన్ డిపోలు కొనసాగిస్తున్నారు?
ప్రజా పంపిణీ వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా గతం కంటే రేషన్ షాపుల సంఖ్య పెరిగింది. జిల్లాలో ప్రస్తుతం 3,358 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల పరిధిలో ఎండియు వాహనాలను ప్రవేశపెట్టి ఇంటివద్దకే ప్రభుత్వం సరకులు అందిస్తోంది. లబ్ధిదారుల నుంచి యాప్ ద్వారా తంబ్ సిగేచర్ ఆధారంగా వీటిని అందించాం. కార్డులో ఉన్న లబ్ధిదారులు ఎవరైనా వెళ్లి తంబ్ వేసి సరకులు తీసుకునేందుకు వీలు కల్పించాం. సరకుల పంపిణీ కూడా పారదర్శకంగా సాగుతోంది. యాప్‌లో నమోదైన వెంటనే పౌరసరఫరాలశాఖ డాష్‌బోర్డులో నమోదవుతుంది. ఎవరెన్ని యూనిట్లు తీసుకున్నారు. ఎంత సమాయానికి వారికి పంపిణీ జరిగింది తదితర వివరాలు అందులో నమోదవుతున్నాయి. దీనివల్ల ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎటువంటి లోపాలకు తావుండదు. మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాలకు ఇదే తరహాలో సరకులు అందిస్తున్నాం.
సరుకు పంపిణీ సమయంలో హెచ్చు తగ్గులను ఎలా సరిచేశారు?
గతంలో డీలరు వద్దకు వెళ్లి సరకులు తీసుకునేవారు. కార్డు దారులు సకాలంలో దుకాణం వద్దకు వెళ్లినా క్యూలైన్లలో నిలబడి తీసుకోవాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఇంటివద్దకే వచ్చి సరకులు ఇస్తున్నారు. తూనికల్లో హెచ్చు తగ్గులకు అవకాశం ఉండదు. హైయాక్యురసీ కలిగిన కంప్యూటర్ తూకం ద్వారా సరకులు అందిస్తున్నాం. ఎక్కడా తగ్గుదల కనిపించదు.
లీగల్ మెటలర్జీ సేవలు ఎలా అందుతున్నాయా?
గతంలో ప్రభుత్వం లీగల్ మెటలర్జీ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ జిల్లా వాప్యంగా పర్యవేక్షణకు నలుగురు, ఐదుగురు ఉద్యోగులు మాత్రమే పని చేసేవారు. కానీ, ప్రస్తుత పౌరసరఫరాలశాఖ ఎండీ హనుమంతు అరుణకుమార్ ఈశాఖను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా లీగల్ మెటలర్జీ విభాగానికి సచివాలయాల్లోని ఇంజినీరింగ్ సహాయకులకు అనుసంధా నం చేశారు. దీనివల్ల పర్యవేక్షణ క్షేత్ర స్థాయిలో మరింత పెరిగింది. లోపాలకు తావు లేకుండా ఈశాఖ బాధ్యతలు నిర్వర్తించడానికి దోహదపడుతోంది.
ఎన్ని సరుకులు పంపిణీ చేస్తున్నారు?
ప్రజా పంపిణీ వ్యవస్థలో నిత్యావసర సరకుల్లో బియ్యం, పంచదార సరఫరా అవుతోంది. గతంలో కందిపప్పు సరఫరా ఉండేది. ప్రస్తుతం కందిపప్పు నిల్వలు లేకపోవడం వల్ల సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత సరపడినంత మేరకు నిల్వలు ఉంటే పంపిణీ ప్రారంభిస్తాం.