Mar 14,2023 18:52

ప్రజాశక్తి - ఇరగవరం
ఉపాధి హామీ పరిరక్షణకు ఉధృత పోరాటాలే మార్గమని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ల చిన వీరభద్రరావు అన్నారు. మంగళవారం అర్జునుడుపాలెం గ్రామంలో పనిచేస్తున్న కూలీలతో ఆయన మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండు పూటలా పని, మస్తరు విధానం చాలా కష్టంగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రోజు కూలి రూ.257 ప్రస్తుతం పెరిగిన ధరలతో పోలిస్తే చాలా తక్కువ అని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ మండుటెండలో కష్టపడి పనిచేస్తున్న కూలీలకు కనీస వేతనం అమలు చేయకుండా వారి శ్రమను దోపిడీ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. నేడు దేశంలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న స్థితిలో ఉపాధి హామీని మరింత విస్తరించి గ్రామీణ ప్రజలకు కొనుగోలు శక్తి పెంచే చర్యలు చేపట్టకపోగా నిర్వర్యం చేసేందుకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనే కుట్రలకు పాల్పడి కూలీల పొట్ట కొడుతుందోని విమర్శించారు. పని ప్రదేశంలో కార్మికుడి ఫొటో తీయడం, మొబైల్‌ యాప్‌లో అప్లోడ్‌ చేయడం, ఆన్‌ లైన్‌ హాజరు తప్పనిసరి అనే కొత్త వ్యవస్థను తీసుకురావడం వల్ల పూర్తి సౌకర్యం లేని ఇంటర్నెట్‌ విధానంతో కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి రెండు పూటా పని రద్దుచేసి రోజు కూలి రూ.600 ఇవ్వాలని, ప్లే స్లిప్పులు ఇవ్వాలని, సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, రైతు, కౌలు రైతు సంఘాల పిలుపులో భాగంగా ఏప్రిల్‌ 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కర్రి వీరరాఘవరెడ్డి, పాలకోడేటి వెంకటలక్ష్మి, జుత్తిగ లక్ష్మి. పాల విజయలక్ష్మి. జుత్తిగ దుర్గమ్మ, కుక్కల పార్వతి, జుత్తిగ సత్యవతి, పంపన అంజమ్మ పాల్గొన్నారు.